తెలంగాణ: విమోచన దినోత్సవం ఒక వైపు... ప్రజా పాలన దినోత్సవం మరో వైపు...

సెప్టెంబర్ 17ను ప్రజా పాలనగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు.

Update: 2024-09-16 15:30 GMT

తెలంగాణ: విమోచన దినోత్సవం ఒక వైపు... ప్రజా పాలన దినోత్సవం మరో వైపు...

September 17 in Telangana history: సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పలువురు నాయకులు పాల్గొంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజును ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించనున్నారు. హైద్రాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం నలుగురు కేంద్ర మంత్రులకు ఆహ్వానం పంపారు.

సెప్టెంబర్ 17న సర్దార్ పటేల్ కు లొంగిపోయిన నిజాం

హైద్రాబాద్ సంస్థానం 1948, సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమైంది. హైద్రాబాద్ సంస్థానం ప్రస్తుతం మహరాష్ట్రలో, కర్ణాటక రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలతో కలిపి ఉండేది. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ, హైద్రాబాద్ సంస్థానంతో పాటు కొన్ని సంస్థానాలు దేశంలో విలీనం కాలేదు. ఈ సంస్థానాల విలీనం కోసం అప్పటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయత్నాలు చేసి సఫలమయ్యారు.

ఆ సమయంలో హైద్రాబాద్ సంస్థానం నిజాం ఏడో నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో ఉంది. 1940 సెప్టెంబర్ లో నవాబ్ సదర్ యార్ జంగ్ రజాకారుల దళాన్ని ప్రారంభించారు. రజాకార్లంటే స్వచ్ఛంధ సేవకులని ఉర్ధూలో అర్ధం.1947 నాటికే హైద్రాబాద్ సంస్థానంలో 2 లక్లల మంది రజాకార్లుండేవారు.

అప్పట్లో గ్రామాల్లో రజాకార్లు దౌర్జన్యం చేసేవారని చెబుతారు. . దీంతో గ్రామాల్లో రజాకార్లు, కమ్యూనిస్టులకు తరచుగా ఘర్షణలు జరిగేవి. ఇదే సమయంలో దేశానికి స్వాతంత్ర్యం రావడంతో జాతీయ పతాకావిష్కరణ చేసిన వారిపై రజాకార్లు క్రూరంగా వ్యవహరించేవారని కమ్యూనిస్టు నాయకులు చెబుతున్నారు.

భారత్ లో విలీనం కావడానికి కొంత సమయం కావాలని అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ కొంత సమయం కోరారు. కానీ, అప్పటికే ఆయన పాకిస్తాన్ లో హైద్రాబాద్ తరపున పీఆర్ఓను నియమించారు. ఈ విషయాలను తెలుసుకున్న పటేల్ ఆయనకు గడువివ్వలేదు. భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలోను 1948 సెప్టెంబర్ 13న ప్రారంభించింది. సెప్టెంబర్ 17న నిజాం సైన్యం భారత సైన్యానికి లొంగిపోతున్నట్టుగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయడంతో సెప్టెంబర్ 18తో ఆపరేషన్ పోలో పూర్తైంది.

ప్రజాపాలనగా నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం

సెప్టెంబర్ 17ను ప్రజా పాలనగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు మంత్రులకు బాధ్యతలను కూడా అప్పగించారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించే కార్యక్రమంలో సీఎం రేవంత రెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి రావాలని కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి , బండి సంజయ్ లకు ఆహ్వానం పంపారు.తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ కోరుతోంది. ప్రజా పాలన పేరుతో కార్యక్రమాలను నిర్వహించడాన్ని తప్పుబడుతోంది. సర్దార్ పటేల్ కాంగ్రెస్ నేత అయితే.... తెలంగాణ విమోచన దినోత్సవాలు ఎందుకు జరపడం లేదని ఆయన ప్రశ్నించారు.

పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన దినోత్సవం

గత మూడేళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గత రెండేళ్లుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

అయితే ఈ ఏడాది అమిత్ షా ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అమిత్ షా ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహించిన బీఆర్ఎస్ సర్కార్

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సెప్టెంబర్ 17ను గత ఏడాది జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.

అయితే అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర ఏళ్లలో ఆ పార్టీ గత ఏడాది మాత్రమే జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహించింది. ఎంఐఎంకు భయపడే బీఆర్ఎస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని అప్పట్లో విపక్షాలు కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశాయి.

ఈ పోరాటంతో సంబంధం లేని పార్టీలన్నీ సెప్టెంబర్ 17 పేరును వాడుకుంటున్నాయని కమ్యూనిస్టులు విమర్శిస్తున్నారు.

Tags:    

Similar News