తెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్‌ కన్ఫ్యూజ్‌ అవుతోందా?

Telangana Congress: ఒకే పదవిని పోలిన పదవుల్లో సీనియర్‌ నేతలు

Update: 2022-05-27 08:30 GMT

తెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట

Telangana Congress: మాములుగానైతే ఏదైనా ఓ సందర్భం వచ్చిందనుకోండి.. అమ్మో అక్కడ మూడు ముక్కలాట జరుగుతుంది అని అంటుంటారు.! కానీ తెలంగాణ హస్తం పార్టీలో నాలుగు ముక్కలాట నడుస్తుందట. ఆ ముక్కలాటలో ఎవరికి వారు బిజీగా ఉంటున్నారట. నాలుగు గ్రూపులను ఏక కాలంలో మెయింటైన్‌ చేస్తూ క్యాడర్‌నే కన్ఫ్యూజ్‌ చేస్తున్నారట. ఇంతకీ ఆ నాలుగు ముక్కలాటలో ఉన్నది ఎవరు? నాలుగు గ్రూపులను తెరచాటుగా పోషిస్తున్న నేతలు ఎవరు? కీలెరిగి వాతలు పెడుతామంటున్న ఆ లీడర్లు ఎవరు? 

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ టూర్‌లో చేసిన దిశానిర్దేశంతో కాంగ్రెస్ నేతలంతా ఏకమయ్యారన్న చర్చ జరిగింది అప్పట్లో.! దూకుడుగా గ్రౌండ్‌లోకి వెళ్తున్నారు. ఇప్పటీకే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేపట్టిన రైతు రచ్చబండ, ఇతర కార్యక్రమాలతో నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రజలతో మమేకమవుతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఈ విషయాన్నంతా పక్కన పెడితే తెలంగాణ హస్తంలో ఒకే పదవిని పోలిన పదవులు ముగ్గురు నేతలు నిర్వహిస్తున్నారట.

పీసీసి చీఫ్ రేవంత్‌రెడ్డి కార్యవర్గం వచ్చినప్పుడే ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌గా మహేశ్వరరెడ్డిని ప్రకటించారు. అప్పటి నుంచి అధ్యక్షుడు చేపట్టే కార్యక్రమాలను కాంగ్రెస్ శ్రేణులు చురుకుగా పాల్గొనేవారు. జాతీయ స్థాయి కార్యక్రమాల్లో పీసీసీ చీఫ్‌తో పాటు, ఇతర సీనియర్లు హాజరయ్యేవారు. ఒకరికి ఒకరు పోటీగా కార్యక్రమాలను నిర్వహిస్తూ జోష్‌ని తీసుకోస్తున్న ఈ సమయంలోనే స్టార్ క్యాంపెయినర్‌గా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించింది ఏఐసీసీ. ఇది అలా ఉంచితే...!

ఇప్పటికే, మధుయాష్కీగౌడ్‌ పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా దూకుడుగా వెళ్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌ రోల్‌ పోషించడమే కాకుండా అధికార పార్టీతో పాటు మరో జాతీయ పార్టీ బీజేపీని తన వాక్చాతుర్యంతో కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు పార్టీ కార్యక్రమాలు ప్రచారం చేస్తూనే కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ శ్రేణుల్లో పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ అంటే స్టార్ క్యాంపెయినర్‌గా భావించేవారు. కానీ ఉన్నఫళంగా కాంగ్రెస్‌ అధిష్టానం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని స్టార్‌ క్యాంపెయినర్‌గా రంగంలోకి దించడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు గందరగోళంలో పడ్డారన్న ప్రచారం నడిచింది. పీసీసీ ప్రచారక కమిటీ చైర్మన్‌కి, స్టార్‌క్యాంపెయినర్‌కి తేడో ఏంటో తెలియక తికమకపడ్డారు.

పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ చేపట్టే బహిరంగసభల్లో మరో స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి పాల్గొంటారా లేక ఎన్నికల సమయంలోనే స్టార్ క్యాంపెయినర్‌గా గా వస్తారా అన్నది తెలియడం లేదంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. స్టార్ క్యాంపెయినర్‌ పదవి వచ్చిన తర్వాత గ్రౌండ్ లెవెల్‌లో కాంగ్రెస్ శ్రేణులను బలోపేతం చేస్తానంటున్న కోమటిరెడ్డి పార్టీ కీలక సమవేశాలకు మాత్రం డుమ్మా కొడుతూ, తన నియోజకవర్గ కార్యక్రమాలకు పరిమితం అవుతున్నారన్న టాక్‌ వినిపిస్తోంది. ఇదంతా ఒక ఎత్తయితే, రాహుల్‌గాంధీ బహిరంగ సభ విషయంలో కూడా ఎవరి సత్తాను వారు నిరూపించుకునే ప్రయత్నంలో క్యాడర్‌ కన్ఫ్యూజ్‌ చేశారని ఇప్పటికీ గాంధీభవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాహుల్ సభ ఏర్పాట్లపై వరంగల్‌తో పాటు పరిసర జిల్లాలో పర్యటించి సమీక్షల వరకే పరిమితమయ్యారే పీసీసీ చీఫ్‌, స్టార్‌ క్యాంపెయనర్‌, ప్రచార కమిటీ ఛైర్మన్‌, ఏఐసీసీ కార్యక్రమల అమలు కమిటీ ఛైర్మన్‌ ఈ నలుగురు నేతలు ఎవరికి వారే తమ ప్రాబల్యం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారట.

ఈ నలుగురు నేతల పదవులు ఒకే రకానికి సంబంధించినవే అయినా ఎవరికి ఎవరు సహకరించుకోవడం లేదన్న చర్చ జరుగుతోంది. అందుకే తెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట ఆడుతూ క్యాడర్‌ను కన్ఫ్యూజ్‌ చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో రాహుల్‌ టూర్‌ను, వరంగల్‌లో ఆయన సభను విజయవంతం చేశామని చెప్పుకుంటున్న హస్తం సీనియర్లు ఎన్నికల ముందు ఎలా ఏకతాటిపైకి వస్తారో క్యాడర్‌ ముందుండి ఎలా నడిపిస్తారో చూడాలి.

Full View


Tags:    

Similar News