సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడిలో విగ్రహం ధ్వంసం: మోటివేషనల్ స్పీకర్ మునావర్ జమాపై కేసు

Update: 2024-10-18 09:04 GMT

సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ లో విగ్రహం ధ్వంసం: మోటివేషనల్ స్పీకర్ మునావర్ జమాపై కేసు


సికింద్రాబాద్ మోండా మార్కెట్ కుమ్మరిగూడలో ముత్యాలమ్మ ఆలయ విగ్రహం ధ్వంసం కేసులో మోటివేషనల్ స్పీకర్ మునావర్ జమాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు రెంజిమెంటల్ బజార్ లోని మెట్రో పోలీస్ హోటల్ కు చెందిన అబ్దుల్ బషీర్ అహ్మద్, రెహమాన్ లపై పోలీసులు కేసు పెట్టారు.మత విద్వేషాలకు కారణమైందని మెట్రో పోలీస్ హోటల్ ను రెవిన్యూ అధికారులు సీజ్ చేశారు. ఈ నెల 14న ఈ హోటల్ లో బస చేసిన సలీం అనే వ్యక్తి ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

అసలు ఏం జరిగింది?

అక్టోబర్ 14న ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహాన్ని సలీం ధ్వంసం చేశారు. ఆలయంలోకి సలీం వెళ్లే దృశ్యాలు సమీపంలోని సీసీటీవీల్లో రికార్డయ్యాయి. నిందితుడిని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల దాడిలో గాయపడిన సలీం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఆలయానికి సమీపంలో ఉన్న మెట్రో పోలీస్ హోటల్ లోనే నిందితుడు బస చేశారు. ఇంత పెద్ద ఘటన జరిగినా కూడా సలీం గురించి పోలీసులకు హోటల్ నుంచి సమాచారం ఇవ్వలేదు. సలీం ఎక్కడ బస చేశారనే విషయాన్ని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.

మెట్రో పోలీస్ హోటల్ ఎందుకు సీజ్ చేశారు?

మెట్రో పోలీస్ హోటల్ లో వ్యక్తిత్వ వికాస శిక్షణకు వచ్చిన అక్కడి ప్రసంగాలకు ఆకర్షితుడై కుమ్మరిగూడలో ప్రార్ధనమందిరంపై దాడి చేశారని పోలీసులు గుర్తించారు. ఈ హోటల్ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు వేదికగా మారిందని పోలీసులు గుర్తించారు. దీంతో నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మీ పెరుమాల్ ఈ హోటల్ ను సీజ్ చేయాలని రెవిన్యూ అధికారులను కోరారు. దీంతో సికింద్రాబాద్ ఆర్డీఓ ఆదేశాలతో రెవిన్యూ అధికారులు ఈ హోటల్ ను సీజ్ చేశారు. ఈ హోటల్ లో వ్యక్తిత్వ వికాసం పేరుతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారని చెబుతున్నారు. నెలకు రూ. 20 వేలు వసూలు చేస్తారు. హోటల్ రూమ్ తో పాటు ఈ క్లాస్ లకు హాజరైతే రూ. 30 వేలు ఛార్జీ వసూలు చేస్తారు. ప్రతి విడతలో 100 నుంచి 150 మంది శిక్షణకు హాజరౌతారు.

మారుతారని పంపితే

ముంబైకి చెందిన సలీం గతంలో ఇలాంటి ఘటనల్లో పాల్గొన్నారు. అతనిలో మార్పు కోసం అతడిని శిక్షణ కోసం ఇక్కడికి పంపారు. అయితే ఈ శిక్షణకు హాజరైన తర్వాత ఆయన ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారని పోలీసులు చెబుతున్నారు. 


Tags:    

Similar News