Schools Reopen: నగరాల్లో బడిబాట పట్టని ప్రైవేట్‌ స్కూల్‌ విద్యార్థులు

* మూడ్రోజులవుతున్న పెరగని విద్యార్థుల హాజరుశాతం * గ్రామీణ ప్రాంతాల్లోనే స్కూల్‌కు వెళ్తున్న స్టూడెంట్స్‌

Update: 2021-09-03 06:07 GMT

గ్రామీణ ప్రాంతాల్లోనే స్కూల్‌కు వెళ్తున్న స్టూడెంట్స్‌ (ఫోటో ది హన్స్ ఇండియా)

Telangana Schools Reopen: తెలంగాణలో బడిగంట మోగి మూడ్రోజులైంది. అయినా స్కూళ్లల్లో విద్యార్థుల హాజరుశాతం పెరగడం లేదు. కోవిడ్‌ భయం వీడకపోవటంతో తల్లిదండ్రులు, పిల్లలను పాఠశాలలకు పంపే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలిస్తే పట్టణ, నగర ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అయితే మెల్లిమెల్లిగా పరిస్థితులు సద్దుమణుగుతాయని, విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు.

మొదటి రోజు ప్రభుత్వ స్కూళ్లల్లో 27.45 శాతం, ప్రైవేటు బడుల్లో 18.35 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తంగా సగటు హాజరుశాతం 22కు మించలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఇక రెండో రోజు కొద్ది మేర హాజరుశాతం పెరిగింది. ఇదిలా ఉండగా పూర్తిగా కోవిడ్‌ కేసులు తగ్గకపోవడంతో థర్డ్‌ వేవ్‌ గురించి జరుగుతున్న ప్రచారంతో తల్లిదండ్రులు పిల్లల్ని పాఠశాలలకు పంపకపోవటమే బెటర్‌ అని భావిస్తున్నారు.

ఇక స్కూళ్లల్లో కోవిడ్‌కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు ఉపాధ్యాయులు. తల్లిదండ్రులు ఎలాంటి అనుమానాలు లేకుండా పిల్లల్ని పాఠశాలలకు పంపాలని కోరుతున్నారు. భౌతిక దూరంతోపాటు మాస్క్‌లు అందిస్తున్నట్లు చెబుతున్నారు. శానిటైజేషన్‌ చేస్తున్నామని తెలిపారు. ఇక విద్యార్థులు మధ్యమధ్యలో చేతులు వాష్‌ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

Tags:    

Similar News