పచ్చని పల్లెగా మారిన హైదరాబాద్ శిల్పారామం
* ఆకట్టుకుంటున్న గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల పాటలు * పల్లెటూరి వాతావరణంతో పూర్తిగా నిండిపోయిన శిల్పారామం
సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది పచ్చని పల్లెలే పెద్ద పండుగ వేళ గలగలా పారే సెలయేళ్లు ఇంటి ముందు అందమైన రంగవల్లులు ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఆస్వాదించేందుకు పట్టణ ప్రజలు పల్లెలకు పరుగులు తీస్తారు. అయితే కరోనా భయంతో సొంతూళ్లకు వెళ్లలేని వారికోసం భాగ్యనగరంలోనే ఓ అందమైన పల్లెటూరు సిద్ధమైంది. శిల్పారామంలో వైభవంగా జరుగుతున్న సంక్రాంతి వేడుకలపై హెచ్ఎంటీవీ ప్రత్యే కథనం.
కరోనా ధాటికి ఈ ఏడాది పండుగలన్నీ కళ తప్పాయి. చాలా మంది సొంతూళ్లకు కూడా వెళ్లలేని పరిస్థితి. దీంతో నగర ప్రజలకు పల్లె వాతావరణాన్ని క్రియేట్ చేసింది శిల్పారామం. సొతూళ్లను మిస్ అవుతున్న ప్రజలను సంక్రాంతి వేడుక చేసుకుందాం రారమ్మంటూ పిలుస్తోంది. తెలుగు సంస్కృతిని ప్రతిభింబించేలా పల్లెటూరే పట్నం వచ్చిందా అన్న రీతిలో శిల్పారామంలో సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చేసిన హరిదాసు సంకీర్తనలు, బుడగ జంగాల ప్రదర్శనలతో శిల్పారామం పచ్చని పల్లెను తలపిస్తోంది. అచ్చ తెలుగు సంస్కృతిని చాటేలా జరుగుతున్న ఈ వేడుకలపై నగర వాసులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ సొంత ఊరికే వెళ్లినట్టు ఫీలవుతున్నామని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి తేట తెలుగు పల్లె వాతావరణాన్ని భాగ్యనగరానికి తెచ్చిన శిల్పారామం నిర్వహకులపై నగర వాసులు ప్రశంసలు కురిపిస్తున్నారు.