Saidabad Singareni Case: సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకొన్నాడు. వరంగల్ జిల్లా స్టేన్‌ఘన్‌పూర్ రైల్వేట్రాక్ పై ఓ డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు. ఈ డెడ్‌బాడీ ఉన్న చేయిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా మృతుడు రాజుగా స్థానిక పోలీసులు, రైల్వే పోలీసులు గుర్తించారు. మృతదేహం చేయిపై మౌనిక అనే పచ్చబొట్టు ఉంది. దాని ఆధారంగా పోలీసులు శవం రాజుదిగా గుర్తించారు.
సైదాబాద్ సింగరేణి కాలనీలో సెప్టెంబర్ 9న చిన్నారికి మాయ మాటలు చెప్పి తన గదికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడి హత్య చేశాడు రాజు. ఈ ఘటనపై కుటుంబసభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రాజును శిక్షించాలని డిమాండ్ చేశారు. నేషనల్ హైవే పై బైఠాయించి నిరసన తెలిపారు.
దాదాపు ఏడు రోజులుగా రాజు కనిపించకుండాపోయాడు. రాజు కోసం దాదాపు వేయి మంది పోలీసులు గాలింపు చేపట్టారు. చిన్నారి ఘటనపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఎల్బీ నగర్ నుంచి బయలుదేరిన రాజు నాగోల్ లో మద్యం కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఉప్పల్ వెళ్లాడు. అక్కడి వరకు సిసీటీవీ ఫుటేజీల ద్వారా అతని కదలికలను పోలీసులు గుర్తించారు.
ఈ ఘటన జరిగి వారం కావొస్తున్నా నిందితుడిని ఇంకా పట్టుకోకపోవడంపై బాధిత కుటంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు పోలీసులు 15 బృందాలుగా విడిపోయి అతడి కోసం గాలింపు చేపట్టారు. రాజు ఫొటోలను, ఊహాచిత్రాలను కూడా విడుదల చేశారు. అన్ని పోలీసు స్టేషన్లకు సైదాబాద్ పోలీసులు అతని ఫొటోను, ఊహాచిత్రాలను పంపించారు. రాజు ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షలు రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు.
ఇక ఈరోజు ఉదయం వరంగల్ జిల్లాలోని నష్‌కల్ రైల్వేట్రాక్‌పై రాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. చేతి మీద వేయించున్న మౌనిక అనే పచ్చబొట్టు ద్వారా రాజుగా పోలీసులు గుర్తించారు.