Sadar Festival: రేపు, ఎల్లుండి ఖైరతాబాద్, నారాయణగూడలో సదర్ ఉత్సవాలు
Sadar Festival 2021: నెల రోజుల ముందే దున్నపోతులను తీసుకువచ్చిన యాదవులు..
Sadar Festival 2021: దీవాళి అనగానే దీపాలు, పటాసులే గుర్తుకువస్తాయి. కానీ హైదరాబాద్ వాసులను మాత్రం సదర్ ఉత్సవాలు మైమరిపిస్తాయి. ఈసారి సదర్ వేడుకలకు సిటీ రెడీ అయ్యింది. రేపు , ఎల్లుండి సదర్ ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాల కోసం భారీ దున్నపోతులను సిటీకి తీసుకువచ్చారు నిర్వాహకులు. ఈసారి హర్యానాకు చెందిన కింగ్, సర్తాజ్, భీము, దార దున్నపోతులు సదర్ ఉత్సవాల్లో సందడి చేయనున్నాయి.
సదర్ ఉత్సవాలను జంట నగరాల్లో యాదవులు కొన్నేళ్ల నుంచి సాంప్రదాయంగా నిర్వహిస్తున్నారు. భారీ దున్నపోతులను పూలదండలు, ఆభరణాలతో అందంగా అలంకరించి వీధుల్లో ర్యాలీగా తిప్పడం సదర్ ప్రత్యేకత. వాటి కొమ్ములను కూడా అందంగా తీర్చిదిద్దుతారు. తీన్మార్ పాటలకు డ్యాన్సులు చేస్తూ ఉల్లాసంగా ముందుకుసాగుతారు. దున్నపోతుల విన్యాసాలు పిల్లలు, పెద్దలను విశేషంగా ఆకట్టుకుంటాయి.
నారాయణగూడలో జరిగే సదర్ వేడుకల్లో హర్యానా దున్నపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. 15 అడుగుల వెడల్పు, 15వందల కిలోల బరువుతో ఉండే దున్నపోతులను నెల రోజుల ముందే సిటీకి తీసుకువచ్చారు. వాటిని పోషించడానికి రోజుకు పదివేల ఖర్చు చేస్తున్నారు. 100 యాపిల్ పళ్లు, 5 కేజీల జీడిపప్పు, బాదం, పిస్తా, నల్లబెల్లం పెడుతూ వాటిని పోషిస్తు్న్నారు. వాటికి స్పెషల్ మసాజ్‌లు కూడా చేపిస్తున్నారు.
మొత్తానికి సదర్ ఉత్సవాలతో యాదవుల్లో కొత్త జోష్ కనిపిస్తుంది. ఈసారి పోటీ పడుతూ సదర్ ఉత్సవాలను జరిపించేందుకు యాదవ్‌లు ముచ్చటపడుతున్నారు.