Musi Riverfront: సబర్మతి రివర్‌ఫ్రంట్‌ ప్రాజెక్ట్ ఖర్చెంత? మూసీ సుందరీకరణ బడ్జెట్ ఎంత?

Update: 2024-10-05 09:31 GMT

Musi Riverfront: సబర్మతి రివర్‌ఫ్రంట్‌ ప్రాజెక్ట్ ఖర్చెంత? మూసీ సుందరీకరణ బడ్జెట్ ఎంత?

సబర్మతి రివర్ ఫ్రంట్ ను మోడీ కట్టుకోవచ్చు...కానీ మూసీ రివర్ ఫ్రంట్ తెలంగాణలో ఎందుకు వద్దంటున్నారని తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ను ప్రశ్నించారు. మూసీ పేరుతో ఎంతకాలం రాజకీయం చేస్తారని ఆయన విపక్షాలను నిలదీశారు. మూసీ వెంట ఇళ్ల కూల్చివేతలను బాధితులు సమర్థిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని రేవంత్ కు ఈటల సవాల్ విసిరారు.

మూసీ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు

లండన్ లోని థేమ్స్ నది తరహాలోనే మూసీ పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ది చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ దిశగా కార్యాచరణను అమలు చేస్తోంది. మూసీ నదిలో కలుస్తున్న డ్రైనేజీ నీటిని, పారిశ్రామిక వ్యర్థాలను శుద్ది చేస్తున్నారు.ఈ మేరకు ఎస్ టీ పీలను నిర్మించారు. మరోవైపు మూసీ వెంట అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ప్రభుత్వం తలపెట్టింది.

ప్రభుత్వ నిర్ణయంపై నిర్వాసితులు ఆగ్రహంతో ఉన్నారు. ఆందోళనలు చేస్తున్నారు. విపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ లు బాధితులకు అండగా నిలుస్తున్నాయి. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, బీజేపీకి చెందిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ప్రతిపక్షాల నిరసనలు తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి మాత్రం మూసీ సుందరీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెబుతున్నారు. బాధితులందరికీ పక్కాగా పునరావాసం కల్పిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో గుజరాత్‌లో మోదీ ప్రభుత్వం నిర్మించిన సబర్మతి రివర్ ఫ్రంట్ ఎలా సాధ్యమైందో ఒకసారి పరిశీలిద్దాం.

సబర్మతి రివర్ ఫ్రంట్ ఎలా ఏర్పడింది?

సబర్మతి నదిని కాలుష్యం నుండి కాపాడడంతో పాటు ఈ ప్రాంతంలో టూరిజం డెవలప్ మెంట్ కోసం రెండు విడతలుగా సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. 2027 నాటికి రెండో విడత పనులు కూడా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సబర్మతి నది తీరంలో కొంత భాగాన్ని అభివృద్ది చేయాలని 1960లో ఫ్రెంచ్ అర్కిటెక్ట్ బెర్నార్డ్ కోహ్న్ ప్రతిపాదించారు.

1966 లో టెక్నికల్ స్టడీస్ పూర్తైన తర్వాత కోహ్న్ అమలుకు సాంకేతిక సమస్యలు లేవని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. నగరంలోని డ్రైనేజీ కాలువ, పంపింగ్ స్టేషన్లను, మురుగునీరు శుద్ది చేసే ప్లాంట్లను అప్ గ్రేడ్ చేయాలని 1992లో నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్లాన్ సూచించింది.

దీంతో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ సబర్మతి రివర్ ఫ్రంట్ కార్పోరేషన్ లిమిటెడ్ ను 1997లో ఏర్పాటు చేసింది.

ఈ నదికి రెండు వైపులా 34 కిలోమీటర్లలో సుమారు 2 వేల కోట్లను ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తొలి విడతలో 1400 కోట్లు ఖర్చు చేశారు. రెండో విడతకు 850 కోట్లను కేటాయించారు. 2027 నాటికి రెండో విడతను పూర్తి చేయాలని ప్లాన్ చేశారు.

గుజరాత్ లో ఎందరికి పునరావాసం కల్పించారు?

ఈ నదిలోకి టెక్స్ టైల్స్ పరిశ్రమలకు చెందిన వ్యర్ధ రసాయనాలు, డ్రైనేజీ నీరు కలవడంతో కాలుష్యంగా మారింది. దేశంలోని కాలుష్య నదుల్లో ఇది రెండో స్థానంలో నిలిచింది. 2023 ఫిబ్రవరిలో సెంట్రల్ పొలూష్యన్ కంట్రోల్ బోర్డు ఓ నివేదికను బయటపెట్టింది. ఈ నివేదిక ప్రకారంగా బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ బీఓడీ లెవల్స్ 4 ఎంజీఎల్ నుంచి 147 ఎంజీఎల్ వరకు ఉన్నాయి.

ఈ నీటిని ట్రీట్ మెంట్ చేసేందుకు 38 సీనరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. రెండు విడతల్లో భాగంగా ఈ నదికి ఇరువైపులా నివాసం ఉంటున్న సుమారు 11 ,000 కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సిన అవసరం ఏర్పడింది. అయితే, ఈ ప్రాజెక్టు పరిధిలో నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని బాధితులు కోర్టును ఆశ్రయించారు. అధికారిక లెక్కల మేరకు 4 వేల మంది బాధితులకు నగర శివార్లలోని మార్ట్ ల్యాండ్ లో పునరావాసం కల్పించారు. మిగిలిన వారికి కూడా పునరావాసం కల్పించనున్నారు.

మూసీ రివర్ ఫ్రంట్ ప్లాన్ ఏంటి?

హైద్రాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో మూసీ వెంట సుమారు 12 వేల అక్రమ నిర్మాణాలున్నాయని అధికారులు గుర్తించారు. ఈ మూడు జిల్లాల్లో ఏఏ ప్రాంతాల్లో కూల్చివేయాల్సిన ఇళ్లకు RBX అంటూ అధికారులు మార్క్ చేశారు. మలక్ పేట ప్రాంతంలో కొందరు ఇళ్లను ఖాళీ చేసేందుకు ఒప్పుకున్నారు. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు తరలించారు. బాధితులు ఖాళీ చేసిన ఇళ్లను ప్రభుత్వం కూల్చివేసింది.

జవహర్ నగర్ కు సమీపంలో వెయ్యి ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని.. దీన్ని పేదలకు ఇళ్లు కట్టిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు తమ ఫామ్ హౌస్ లు కూల్చివేయకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే మూసీ బాధితులను రెచ్చగొడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

హైడ్రాపై హైకోర్టు రేవంత్ రెడ్డి పై మొట్టికాయలు వేసినా ఆయనలో మార్పు రాలేదని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. మూసీ వెంట అక్రమ నిర్మాణాలను కూల్చివేయడాన్ని బాధితులు సమర్థిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సీఎం కు సవాల్ విసిరారు. సబర్మతి రివర్ ఫ్రంట్ కు రూ. 1400 కోట్లు ఖర్చు చేశారని, మూసీ రివర్ ప్రంట్ కు రూ. 1.50 లక్షలు ఖర్చు చేస్తామని చెప్పడంపైనే తమకు అనుమానాలున్నాయన్నారు.

బడ్జెట్ గురించిన ప్రశ్నలకు కూడా ప్రభుత్వం ప్రజలకు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాల్సి ఉందనడంలో సందేహం లేదు. సబర్మత్ ఫ్రంట్ 34 కిలోమీటర్ల పొడవున నదీ ప్రాంతాన్ని సుందరీకరణ చేసింది. మూసీ సుందరీకరణం హైదరాబాద్ నగరంలో 55 కిలోమీటర్ల మేర ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. కేవంల 11 కిలోమీటర్లు అదనంగా ఉన్న పరీవాహక ప్రాంతానికి అందుకు వంద రెట్లకు పైగా ఎందుకు ఖర్చవుతుందన్న ప్రశ్నకు రేవంత్ సర్కార్ సమాధానం ఇవ్వాలి.అయితే, ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి ఈ విమర్శలను కొట్టి పారేస్తున్నారు. మీరు సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించుకోవచ్చు. తెలంగాణలో మాత్రం మూసీ సుందరీకరణకు అడ్డం పడతారా అని ఆయన ప్రశ్నించారు.

మూసీ సుందరీకరణపై ఏం చేయాలనే దానిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, కార్యాచరణ ప్రారంభమైన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. భవిష్యత్తు తరాల కోసం హైడ్రా, మూసీ ప్రక్షాళనతో ప్రజా పాలన చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. పేదల కన్నీళ్లు చూసిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ పరస్పర ఆరోపణలతో ఉద్రిక్తంగా మారుతున్న వాతావరణాన్ని అఖిలపక్ష సమావేశం చక్కబెడుతుందా అన్నది వేచి చూడాలి.

Tags:    

Similar News