హైదరాబాద్‌లో ఇక 24 గంటల పాటు ఆర్టీసీ సర్వీసులు
TSRTC: ప్రయాణికుల డిమాండ్ మేరకు అర్థరాత్రి బస్సులను నడిపిస్తున్న ఆర్టీసీ
TSRTC: హైదరాబాద్ నగరంలోని సిటీబస్సులు ఇక 24 గంటలు పరుగులు తీయనున్నాయి. ప్రయాణికుల డిమాండ్ తోపాటు రద్దీ ఉన్న రూట్లలో అర్ధరాత్రి బస్సులను నడిపించనున్నారు. ఈ బస్సులు డిపోలకు చేరుకొనే సమయానికి రెగ్యులర్ బస్సులు తిరిగి రోడ్డెక్కుతాయి. దీంతో 24 నాలుగు గంటల పాటు ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
మహానగరంలో 10 దాటిందంటే బస్సుల సంఖ్య తగ్గిపోతుంది. దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి, కొన్ని సందర్బాల్లో ట్రైన్ ఆలస్యం కారణంగా నగరానికి చేరుకునే ప్రయాణికులకు బస్సులు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ రవాణ వ్యవస్ధను నమ్ముకోవాల్సి వచ్చేది. ఇలాంటి సమస్యలు అధికం అవ్వడంతో ప్రయాణికుల సమస్యలకు చెక్ పెడుతూ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి వివిధ మార్గాల్లో నైట్ బస్సులు నడుస్తున్నాయి. ప్రతిరోజు సుమారు 200 రైళ్లు సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తాయి. 80 ప్రధాన ఎక్స్‌ప్రెస్‌లు దూరప్రాంతాల నుంచి నగరానికి చేరుకొంటాయి. వీటిలో కొన్ని అర్ధరాత్రి నగరానికి వస్తే మరి కొన్ని తెల్లవారు జామున సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుతాయి. అదే సమయంలో కొన్ని రైళ్లు ఉదయం 3.30 గంటల నుంచే బయలుదేరుతాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకోవడం తిరిగి ఇళ్ళకు చేరుకోవడం ప్రయాణికులకు కష్టాంగా ఉంటుంది.
సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పటాన్‌చెరు వరకు అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారు జాము వరకు 2 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఆ తరువాత రెగ్యులర్ బస్సులు అందుబాటులోకి వస్తాయి. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఆఫ్జల్‌గంజ్, మెహదీపట్నం, బోరబండ, ఇతర ప్రాంతాలకు కూడా నైట్ బస్సులను నడుపుతున్నారు. ఈ మార్గాల్లో ప్రతి అరగంట నుంచి 45 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ చిలకలగూడ క్రాస్‌రోడ్డు నుంచి హయత్‌నగర్ వరకు మరో రెండు బస్సులు నడుస్తున్నాయి. అలాగే చిలకలగూడ నుంచి ఇబ్రహీంపట్నం వరకు నైట్ బస్సులను నడుపుతున్నారు. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ నుంచి లింగంపల్లి నైట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి.
24గంటల సర్సీస్‌లో బస్సుల్లో అన్ని రకాల పాస్‌లను అనుమతిస్తారు. 24 గంటల పాటు చెల్లుబాటయ్యే ట్రావెల్ యాజ్ యు లైక్ టిక్కెట్‌లపైనా ప్రయాణికులు నైట్ బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. ప్రయాణికుల సౌకర్యం కోసం అవసరాన్ని బట్టి మరిన్ని ప్రాంతాల్లో నైట్ బస్సు సర్సీస్‌లు పెంచేందుకు సిద్ధంగా ఉంది ఆర్టీసీ.