Royal Bengal Tiger Kadamba Died: జూపార్క్‌లో బెంగాల్ టైగర్ మృత్యువాత..
Royal Bengal Tiger Kadamba Died: హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కులో 11 ఏళ్ల వయసున్న రాయల్ బెంగాల్ టైగర్ మృతి చెందింది.
Royal Bengal Tiger Kadamba Died: హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్కులో 11 ఏళ్ల వయసున్న రాయల్ బెంగాల్ టైగర్ మృతి చెందింది. జూపార్క్ అధికారులు తెలిపిన వివరాల్లెకెళితే 11 ఏళ్ల వయస్సు ఉన్న 'కదంబ' అనే బెంగాల్ టైగర్ శనివారం (జులై 4) రాత్రి 9.20 గంటల సమయంలో మృతి చెందిందని తెలిపారు. రాయల్ బెంగాల్ టైగర్ మృతిపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు జూపార్క్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 2014లో కర్ణాటకలోని పిలుకుల బయోలజికల్ పార్క్, మంగళూరు నుంచి జంతువుల మార్పిడి ద్వారా అరుదైన రాయల్ బెంగాల్ టైగర్ జాతికి చెందిన ఈ పులిని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ పులి మరణానికి ముందు వరకు ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదని తెలిపారు. ప్రతి రోజు పుష్టిగా ఆహారం తీసుకునేదని వెల్లడించారు. ఇక పోతే కదంబ మృతదేహానికి ప్రొఫెసర్ లక్ష్మణ్ నేతృత్వంలోని వెటర్నరీ డాక్టర్ల బృందం పోస్టుమార్టం నిర్వహించిందని తెలిపారు. కదంబ గుండె వైఫల్యం కారణంగానే అకస్మాత్తుగా మృత్యువాతపడినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందని తెలిపారు. అనంతరం అత్తాపూర్‌లోని వెటర్నరీ బయోలాజికల్ ఇన్‌స్టిట్యూట్‌కు పులి నుంచి రక్త నమూనాలు సేకరించి పంపించినట్లు జూపార్క్ అధికారులు తెలిపారు.
ఇక పోతే ప్రస్తుతం నగరంలోని జూపార్క్‌లో 20 రాయల్ బెంగాల్ టైగర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పసుపు వర్ణపు పులుల్లో 8 పెద్దవి, 3 పిల్లలు ఉన్నట్లు తెలిపారు. వీటిలో రోజా (21), సోని (20), అపర్ణ (19) పులులు ఇప్పటికే సగటు జీవితకాలాన్ని అధిగమించాయని వెల్లడించారు. వీటిలో పసుపు రంగు పులులు 11 ఉండగా.. అరుదైన తెలుపు వర్ణానికి చెందిన రాయల్ బెంగాల్ టైగర్లు 9 ఉన్నట్లు వివరించారు.