Revenue Department in Karimnagar: కరోనా వైరస్ కంటే..రెవెన్యూ వైరసే డేంజర్..కరపత్రాలు పంచిన గుర్తుతెలియని వ్యక్తి
Revenue Department in Karimnagar: కరోనా వైరస్ కంటే ఇంకా భయంకరమైన, ప్రమాదకరమైన వైరస్ రెవెన్యూ వైరస్ అని గుర్తుతెలియని ఓ వ్యక్తి ఏకంగా కరపత్రాలను ముద్రించి ఓ గ్రామంలో పూర్తిగా పంచాడు. రెవెన్యూ అధికారులు చేసే అన్యాయాలను చూసి విసిగి వేసారిన ఆ వ్యక్తి ఈ విధంగా తన బాధను వెల్లగక్కాడు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. నయాబ్ తాసిల్దార్ కమృద్దీన్ బాధితులం అని ఆరోపణలు చేస్తూ మండలంలోని అన్ని గ్రామాల్లో ఆ వ్యక్తులు కరపత్రాలను ఇంటింటికి పంచారు. ఈ సంఘటనతో ప్రస్తుతం గన్నేరువరం మండలం మొత్తం రెవెన్యూ అవినీతి బాగోతాలు హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఇబ్బందులను తొలగించడానికి ఎంతో ప్రతిష్టాత్మకంగా భూ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ సిబ్బంది రైతుల సమస్యలను పరిష్కరించాల్సి ఉండగా వారు లంచాలకు అలవాటు పడి సరైన సమయంలో పనులు పూర్తి చేయడం లేదని. గత కొంత కాలంగా రెవెన్యూ అధికారులు సామాన్య రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ రైతులను వేధిస్తున్నారని, పనులు జరగాలంటే లంచాలు ఇవ్వాలని, లేదా పనీ చేయమంటున్నారు. అధికారులపై విసుగెత్తిన రైతులు కరపత్రాలు ముద్రణ చేసి రెవెన్యూ అధికారుల పై ఉన్న ఆవేశాన్ని ఈ విధంగా ఇస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరస్ అయినప్పటికీ రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో గన్నేరువరం పోలీసులు సుమోటోగా కేసును స్వీకరించారు. రెవెన్యూ అధికారుల లంచగొండి బాగోతాన్ని బయట పెట్టిన గుర్తుతెలియని వ్యక్తుల గురించి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు.