Telangana Government: రెవెన్యూ వివాదాలకు దూరంగా ఉండాలి..
Telangana Government | తెలంగాణాలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అధికారులు ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఆదేశాలు జారీ చేసింది.
Telangana Government | తెలంగాణాలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అధికారులు ఎటువంటి అవకతవకలకు పాల్పడకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టం ఈ నెల 7 నుంచే అమల్లోకి వచ్చినట్టు ప్రస్తావిస్తూ, తదుపరి వీటిపై ఎటువంటి నిర్ణయం తీసుకున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. వీటిపై ఇప్పటికే కొంతమంది అధికారులు ముందు తేదీతో కొన్ని పనులు నిర్వహించినట్టు ప్రభుత్వానికి తెలియడంతో ఈ చర్యలు చేపట్టింది. దీంతో పాటు కొత్త చట్టంలో భాగంగా తహశీల్ధారులకు విధులను ప్రత్యేకంగా తెలియజేసింది. దీంతో పాటు తొలగించని వీఆర్వో వ్యవస్థ వల్ల ఖాళీ అయిన ఉద్యోగులను వేరే శాఖల్లో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.
రెవెన్యూ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నెల ఏడో తేదీ నుంచే ఆంక్షలు అమలులోకి వస్తాయని తెలిపింది. రెవెన్యూ వివాదాలపై నిర్ణయాలు తీసుకుంటే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. కొత్తగా భూమి హక్కులు, పట్టదారు పాసుపుస్తకాలు చట్టం–2020 మనుగడలోకి వస్తున్న తరుణంలో భూ వివాదాలు, ఇతరత్రా వ్యవహారాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేస్తూ భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) సోమేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో రాజధాని శివారు జిల్లాలోని ఓ అధికారి పాత తేదీతో ఉత్తర్వులు ఇవ్వడం..దీనిపై ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొత్త చట్టంలో రెవెన్యూ వ్యవహారాల్లో అధికారుల పాత్రను పరిమితం చేయడంతో పాటు రెవెన్యూ కోర్టులను రద్దు చేశారు. దీంతో ఇప్పటివరకు తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్ల కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసుల విచారణ బాధ్యతలను త్వరలో ఏర్పాటు చేయబోయే ఫాస్ట్‌ట్రాక్ ట్రిబ్యునళ్లకు బదలాయించనున్నారు. ఈ నేపథ్యంలో పెండింగ్ కేసులు, ఇతర భూ వివాదాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సీసీఎల్‌ఏ స్పష్టం చేశారు. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.
నాయబ్ తహసీల్దార్లకు ప్రోటోకాల్ విధులు
తహసీల్దార్లకు ప్రోటోకాల్ విధుల నుంచి విముక్తి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రముఖుల పర్యటనలను దగ్గరుండి చూసుకునే తహసీల్దార్లు ఇకపై కేవ లం రిజిస్ట్రేషన్ల వ్యవహారాలు, ప్రభుత్వ భూ ముల పరిరక్షణకే పరిమితం కానున్నారు. ఇక పై ప్రోటోకాల్ బాధ్యతలను నయాబ్ తహసీల్దార్లు(డిప్యూటీ తహసీల్దార్లు) చూసుకోనున్నారు. ఇదిలావుండగా, వీఆర్వో వ్యవస్థ రద్దు కావడంతో గ్రామాల్లోని ప్రభుత్వ భూములను కాపాడే విధులను వీఆర్‌ఏలకు కట్టబెడతారు. అయితే ప్రస్తుతం ఉన్నట్లుగాకుండా ఒకరినే ఈ సేవలకు వాడుకొని మిగతావారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేయనున్నారు.
రిజిస్ట్రేషన్లపై వారం రోజుల్లో స్పష్టత
రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా తహసీల్దార్ల అధికారాలకు కత్తెర పెట్టిన సర్కారు కేవలం సాగు భూముల రిజిస్ట్రేషన్లకే పరిమితం చేసింది. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు మాత్రం ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్ట్రార్లే చేస్తారు. అయితే, ఎప్పటి నుంచి ఈ విధానం అమలు చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.