నా బిడ్డ లగ్గానికి కూడా పోనియ్యలేదు.. కక్ష మీదా నాదా? కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న

నా బిడ్డ లగ్గానికి కూడా పోనియ్యలేదు.. కక్ష మీదా నాదా? కేటీఆర్‌కు రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న
Revanth Reddy aggressive speech against KCR and KTR: సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ కక్షకు పాల్పడుతున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నా బిడ్డ లగ్గానికి కూడా పోనియ్యకుండా అడ్డంపడిన మీది రాజకీయ కక్ష అవుతుందా లేక నాదా చెప్పాలని ప్రశ్నించారు.
లగ్న పత్రిక రాసుకునే సమయంలో కూడా 2 గంటల ముందు చర్లపల్లి జైలు నుండి ఎన్ కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లి మళ్లీ అక్కడి నుండి సీదా చర్లపల్లికి వెళ్లాను అని ఆనాటి పరిస్థితిని రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఈ భూమ్మీద ఎవరికైనా సరే పిల్లలకంటే ఎక్కువ ఏముంటుంది? అలాంటిది నా బిడ్డ లగ్న పత్రిక రాసుకోవడానికి వెళ్లేటప్పుడు అడ్డం పడితే కూడా తాను ఏమీ అనలేదన్నారు.
తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సమయంలో ఎవరో కేటీఆర్ గెస్ట్ హౌజ్ మీద డ్రోన్ కెమెరా ఎగురేసి వారి విలాసాలకు సంబంధించిన ఫీడ్ తీసుకొచ్చి నాకిచ్చారు. ఆ ఫీడ్ మీడియాకు లీక్ చేశాననే కోపంతో నన్ను తీసుకెళ్లి అదే చర్లపల్లి సెంట్రల్ జైలులో డిటెన్షన్ సెల్ లో పెట్టిన మీది రాజకీయ కక్ష కాదా అని ప్రశ్నించారు. తను ఎంపీగా, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండి కూడా చర్లపల్లి జైలులో 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపాను. అయినా కూడా మీమీద తను రాజకీయ కక్ష చూపించలేదు అని రేవంత్ రెడ్డి అన్నారు.
ఒకవేళ నిజంగానే నేను మీ మీద రాజకీయ కక్ష చూపించాలనుకుంటే మీ ఇంట్లో ఎవ్వరూ బయట ఉండరు... అందరూ చర్లపల్లి జైల్లోనే ఉంటారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తను ఎన్నికల ముందు చెప్పినట్లుగా మీరు ( కేసీఆర్) ఎలాగూ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టియ్యలేదు కానీ తను మీ కోసం జైల్లోనే మీకు డబుల్ బెడ్ కట్టిస్తానని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చానని అన్నారు. తను కేసీఆర్ కుటుంబం మీద రాజకీయ కక్ష సాధించే వాడినే అయితే ఆ హామిని కూడా అమలు చేసేవాడినని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.