కేబినెట్ విస్తరణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఖర్గేకు జానా లేఖ
Jana Reddy: తెలంగాణ కేబినెట్ విస్తరణలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జానారెడ్డి కాంగ్రెస్ నాయకత్వానికి మంగళవారం లేఖ రాశారు.
Jana Reddy: తెలంగాణ కేబినెట్ విస్తరణలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జానారెడ్డి కాంగ్రెస్ నాయకత్వానికి మంగళవారం లేఖ రాశారు. ఎఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఎఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కు ఆయన లేఖ రాశారు. ఈ నెల 2 లేదా మూడో తేదీన మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో జానారెడ్డి లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది.
రేవంత్ రెడ్డి కేబినెట్‌లో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాకు ప్రాతినిథ్యం లేదు. తెలంగాణలోని 45 శాతం జనాభా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉంది. మూడు పార్లమెంట్ స్థానాలున్నాయి. దీంతో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాతినిథ్యం కల్పించాలని జానారెడ్డి కోరారు. రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమకు ప్రాతినిథ్యం కల్పించాలని కోరుతూ కాంగ్రెస్ అధిష్టానానికి లేఖలు రాశారు.
2023 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. ఈ ప్రాంతంలో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్ధులు గెలిచారు. త్వరలోనే జీహెచ్ఎంసీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో హైదరాబాద్ లో తన బలాన్ని పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మంత్రివర్గ విస్తరణలో హైదరాబాద్ కు ప్రాధాన్యత ఇవ్వాలని రేవంత్ రెడ్డి కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న ఒకరిద్దరిని తప్పించి వారి స్థానంలో కొత్తవారికి ఛాన్స్ ఇస్తారనే ప్రచారం కూడా సాగుతోంది.