రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో కుందనపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాగు దాటే ప్రయత్నంలో 10 మంది రైతులు నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. వాగులో చిక్కుకున్న 10 మంది రైతులను రెస్క్యూ బృందం రక్షించారు. రెస్క్యూ హెలికాప్టర్ ద్వారా ఒడ్డుకు చేర్చారు. ఘటనపై స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి ఎంపీపీ మల్లారెడ్డి ఫోన్‌లో సమాచారం అందించారు. రైతులను రక్షించాలంటూ ఆయన తక్షణమే మంత్రి కేటీఆర్‌కు ఫోన్‌లో వివరాలు తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్.. ఘటనాస్థలికి హెలికాఫ్టర్ పంపాలని సీఎస్‌తో మాట్లాడారు. తక్షణమే హెలికాప్టర్ ద్వారా రెస్క్యూ బృందాలు ప్రయత్నాలు చేపట్టాయి. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. రైతులు క్షేమంగా ఒడ్డుకు చేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.