TRS MLA Tests Positive : తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతోంది. ముఖ‌్యంగా అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కోవిడ్ కంగారు పెడుతోంది. వరుసగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా వైరస్ సోకుతుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా తాజాగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు కరోనా సోకింది. సింగరేణి వనమహత్సోవంలో పాల్గొన్న ఎమ్మెల్యే, మేయర్‌కు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఎమ్మెల్యే చందర్ కరోనా పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. కరోనా బారిన పడ్డ ఎమ్మెల్యే కోరుకంటి చందర్.. ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ పైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక రామగుండం మేయర్ గతవారం రోజులుగా హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 983 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 67,660 కి చేరింది. మృతుల సంఖ్య 551 కి పెరిగింది. కరోనా నుంచి కోలుకోని మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 48,609 కి చేరింది. ప్రస్తుతం 18,500 మంది చికిత్స పొందుతున్నారు.