కరీంనగర్ జిల్లాకు ప్రభుత్వ కార్యదర్శి, నీటిపారుదల శాఖ కార్యదర్శి
*సీఎం ఆదేశాల మేరకు జిల్లాకు వచ్చిన స్మితా సబర్వాల్, రజత్ కుమార్
Karimnagar: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ పంప్ హౌస్, రిజర్వాయర్‌ను ప్రభుత్వ కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ పరిశీలించారు. గతంలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సాగునీటి కాల్వల పెండింగ్ పనులు పూర్తిచేయాలని కోరడంతో సీఎం కేసీఆర్ ఆదేశాలతో స్మితాసబర్వాల్, రజత్ కుమార్ పంప్ హౌస్, రిజర్వాయర్ ను సందర్శించి పరిశీలించారు.
పెండింగ్ పనులు పూర్తి చేస్తే 80 వేల ఎకరాల ఆయకట్టు పూర్తి సాగులోకి వస్తుందని ఎమ్మెల్యే రవిశంకర్ స్మితాసబర్వాల్, రజత్ కుమార్ కు తెలిపారు. దీంతో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ను ఆదేశించారు. అలాగే నారాయణపురం, మంగపేట గ్రామాల్లోని కొన్ని ఇండ్లు ముంపునకు గురి అవుతున్నాయని తమ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కోరారు. నిబంధనల ప్రకారం ముంపు బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ కు స్మితా సబర్వాల్ ఆదేశించారు.