దసరాకు తెలుగురాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లు.. రూట్ల వివరాలు ఇవే..

Update: 2020-10-14 05:44 GMT

దసరా పండగ వచ్చిందంటే చాలు పట్టణాల్లో కొలువులు చేసుకునే వారు, బతుకు దెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు, అత్తగారింటికి వెళ్లిన ఆడపడుచులు తమ తమ గ్రామాలకు పయణం అవుతారు. అయితే ప్రతి ఏడాది లెక్కకు మించిన రైల్లు, బస్సులు నడుస్తుండడంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఇబ్బంది లేకుండా ఉండేది. అయితే ఈ ఏడాది కరోనా కారణంగా రైల్లు, బస్సులు ఎక్కువగా నడవకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎదురైంది. అయితే ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందులను కాస్త తొలగించే దిశగా రైల్వేశాఖ ఓ చక్కటి ఆలోచన చేసింది. దసరా పండగ రద్దీ దృష్ట్యా రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుని దేశవ్యాప్తంగా 392 స్పెషల్ రైళ్లు నడుపనుంది. అయితే ఈ రైళ్లు ఈ నెల 20 నుంచి వచ్చే నెల 30 మధ్య తెలుగు రాష్ట్రాల మీదుగా నడవబోతున్నాయి. నారాయణాద్రి, గౌతమి, శబరి, ఛార్మినార్‌, బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లు నడవబోతున్నాయి. ఈ రైళ్లను రైల్వే శాఖ ప్రధానమైన, ప్రయాణికుల డిమాండ్‌ ఉన్న రూట్లలో నడిపేందుకు సిద్ధమవుతోంది. ఈ రైళ్లలో రోజు నడిచే రైళ్లతో పాటు వారానికి 2,3 రోజులు అలాగే వారానికి ఓ సారి నడిచే రైళ్లు కూడా ఉన్నాయి.

ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా 666 రైళ్లను (మెయిల్‌/ ఎక్స్‌ప్రెస్‌లు)ను ప్రత్యేకంగా నడపుతుండగా 50 రోజుల పాటు పండగ ప్రత్యేక రైళ్లను అదనంగా నడుపుతారు. ఈ రైళ్లన్నీ నవంబరు 30 తర్వాత నిలిచిపోతాయి. స్పెషల్ రైళ్లు మాత్రమే కాకుండా థర్డ్‌ ఏసీ బోగీలు కూడా అదనంగా ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక రైళ్ల టిక్కెట్ ధరలు ఆయా తరగతులను బట్టి సాధారణ రైళ్లతో పోలిస్తే 10-30% మేర ఎక్కువగా ఉండనుంది.

ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా నడవనున్న రైళ్ల వివరాల్లోకెళితే ప్రతిరోజు నడిచే రైళ్లలో తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (విశాఖపట్నం-కడప), ఛార్మినార్‌ (హైదరాబాద్‌-చెన్నై), శబరి (సికింద్రాబాద్‌-త్రివేండ్రం), బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ (కాచిగూడ-మైసూర్‌), నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌ (సికింద్రాబాద్‌-తిరుపతి), గౌతమి (లింగంపల్లి-కాకినాడ), నర్సాపూర్‌ (సికింద్రాబాద్‌-నర్సాపూర్‌), హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌ (హుబ్లీ-సికింద్రాబాద్‌ )లు ఉన్నాయి.

వారానికి 5 రోజుల నడిచే రైళ్ల వివరాల్లోకెళితే విశాఖపట్నం-విజయవాడ డబుల్‌ డెక్కర్‌ రైళ్లు నడవనున్నాయి.

అదే విధంగా వారానికి 3 రోజులు నడిచే రైళ్ల వివరాల్లోకెళితే రాజ్‌కోట్‌ ఎక్స్‌ప్రెస్‌ (సికింద్రాబాద్‌-రాజ్‌కోట్‌) రైళ్లు ఉన్నాయి.

అదే విధంగా వారానికి 2 రోజులు నడిచే రైళ్లలో జైపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (హైదరాబాద్‌-జైపూర్‌) వయా నాందేడ్‌, తిరుపతి-అమరావతి (మహారాష్ట్ర), రైళ్లు ఉన్నాయి.

ఇక వారానికి ఒక్కరోజు మాత్రమే నడిచే రైళ్ల వివరాలు చేసుకుంటే గౌహతి ఎక్స్‌ప్రెస్‌ (సికింద్రాబాద్‌-గౌహతి), భువనేశ్వర్‌-తిరుపతి (విజయవాడ మీదుగా), అమరావతి ఎక్స్‌ప్రెస్‌ (విజయవాడ-హుబ్లీ) రైళ్లు ఉన్నాయి. వీటితోపాటు తెలుగు రాష్ట్రాల మీదుగా పలు రైళ్లు రాకపోకలు కొనసాగనున్నాయి.

Tags:    

Similar News