ఇవాళ వరంగల్‌లో రాహుల్ గాంధీ పర్యటన

*రైతు సంఘర్షణ సభకు భారీ ఏర్పాట్లు *ఆర్ట్స్ కాలేజీ మైదానం ముస్తాబు

Update: 2022-05-06 00:38 GMT

ఇవాళ వరంగల్‌లో రాహుల్ గాంధీ పర్యటన

Rahul Gandhi: వరంగల్ లో ఇవాళ రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. తెలంగాణ టూర్ లో భాగంగా వరంగల్ కు రానున్న రాహుల్ హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిగే రైతు సంఘర్షణ సభలో పాల్గొని వరంగల్ డిక్లరేషన్ ను ప్రకటించనున్నారు. ఇందుకోసం ఆర్ట్స్ కాలేజి మైదానం ముస్తాబైంది. ఈ సభకు ఐదు లక్షల మందిని సమీకరించనున్నట్లు నేతలు చెబుతున్నారు.

హనుమకొండలో శుక్రవారం తలపెట్టిన రైతు సంఘర్షణ సభ కాంగ్రె‌స్ లో నయాజోష్‌ నింపుతోంది. సభకు ముఖ్యఅతిథిగా రాహుల్ గాంధీ రానుండడంతో సభ విజయవంతానికి హస్తం నేతలు ఒక్కటై కదులుతున్నారు. 2002లో హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజి ప్రాంగణంలో సోనియాగాంధీ సభ సక్సెస్ అయి పార్టీ అధికారంలోకి వచ్చిందన్న సెంటిమెంట్ తో ఈసారి రాహుల్ గాంధీ సభను ఇదే ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. 2023 సాధారణ ఎన్నికలకు ఈ సభావేదిక నుంచే రాహుల్ గాంధీ సమరశంఖం పూరిస్తారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రైతుల సమస్యలే ప్రధాన అజెండాగా సభను నిర్వహిస్తోంది. రైతు శ్రేయస్సే ప్రధాన అంశంగా వరంగల్‌ డిక్లరేషన్‌ను రాహుల్‌గాంధీ ప్రకటించనున్నట్లు కాంగ్రెస్‌ నేతలు వెల్లడించిన నేపథ్యంలో రైతులు, ప్రజా సంఘాలు ఇతర వర్గాలో ఆసక్తి నెలకొంది.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ వేదికగా నిర్వహించ తలపెట్టిన రైతు సంఘర్షణ సభకు ఓరుగల్లు ముస్తాబైంది. హన్మకొండ నుంచి హైదరాబాద్ రోడ్డులో అడుగడుగునా రాహుల్ ను స్వాగతిస్తూ నేతలు ఏర్పాటు చేసిన కటౌట్లు, బ్యానర్లు, కాంగ్రెస్ జెండాలతో కలర్ ఫుల్ గా కనిపిస్తోంది. రైతు సంఘర్షణ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించే క్రమంలో ఈ సభకు సుమారు ఐదు లక్షల మంది తరలివస్తారని నేతలు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం నేతలంతా అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ పాల్గొనే సభావేదిక ఆర్ట్స్ కాలేజి గ్రౌండ్స్ ను సుందరంగా ముస్తాబు చేశారు. ఈ సభ కోసం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో మొత్తం మూడు వేదికలను నిర్మించారు.

సభ ఆరంభానికి ముందు రాహుల్‌గాంధీ రైతు కుటుంబాలను కలిసి వారితో మాట్లాడిన తర్వాత ప్రధాన వేదికపై ఆసీనులవుతారు. సభ ప్రధాన వేదికపై రాహుల్‌గాంధీతో పాటు మొత్తంగా 50 మంది నేతలు కూర్చుంటారు. ఇక వేదిక వెనకాల గ్రీన్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. 40 మంది వరకు ఏఐసీసీ, టీపీసీసీ, జిల్లా స్థాయి ముఖ్య నేతలు వేదికపైకి ఆహ్వానించని వారు గ్రీన్‌ రూమ్‌లో ఉంటారు. రాహుల్ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో 4.50 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. 5:10 గంటలకు ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాప్టర్ ద్వారా వరంగల్‌కు బయలుదేరతారు. 5:45 గంటలకు వరంగల్ గాబ్రియెల్ స్కూల్‌కు చేరుకుంటారు. రాహుల్ వెంట టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ ఉంటారు. అక్కడి నుంచి భారీవాహనాల ర్యాలీ ద్వారా సభ వేదిక వద్దకు 6.05 గంటలకు చేరుకుంటారు. ఫాతిమానగర్‌ నుంచి రాహుల్‌గాంధీ ఓపెన్‌ టాప్‌ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ కదులుతారు. దాదాపు 2.5 కిలోమీటర్ల పొడవునా రాహుల్‌గాంధీ ర్యాలీ ఉండడంతో రోడ్డుకు ఇరువైపులా బారికేడ్ల నిర్మాణం ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాత్రి ఏడుగంటలకు రాహుల్ ప్రసంగం ప్రారంభమవుతుంది. సుమారు 40నిముషాలపాటు రాహుల్ ప్రసంగిస్తారు. రాత్రి ఎనిమిది గంటలకు రాహుల్ తిరిగి హైదరాబాద్ కు రోడ్డు మార్గం ద్వారా వెళ్తారు.

ఇక రాత్రి బంజారాహిల్స్‌లోని హోటల్‌ తాజ్‌కృష్ణలో రాహుల్ గాంధీ బస చేస్తారు. అలాగే మరుసటి రోజు శనివారం 7వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు తాజ్‌కృష్ణ నుంచి బయలుదేరి 12:50 గంటలకు సంజీవయ్య పార్కుకు చేరుకుంటారు. 12:50 నుంచి 1:10 గంటల మధ్య దివంగత మాజీ సీఎం సంజీవయ్యకు నివాళులు అర్పిస్తారు. మధ్యాహ్నం 1:15కు అక్కడి నుంచి బయలుదేరి 1:30కి గాంధీభవన్‌ చేరుకుంటారు. మధ్యాహ్నం 1:45 నుంచి 2:45 వరకు అక్కడ పార్టీ నాయకులతో సమావేశం అవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం, ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నట్టు సమాచారం. తర్వాత మెంబర్‌షిప్‌ కో-ఆర్డినేటర్లతో ఫొటోలు దిగుతారు. ఆ తర్వాత 4 గంటలకు గాంధీభవన్ నుంచి రోడ్డు ద్వారా ఎయిర్‌పోర్టుకు వెళ్తారు. సాయంత్రం 5:50 గంటలకు ఢిల్లీ తిరుగు పయనమవుతారు.

సభ ప్రధాన అజెండా వ్యవసాయ రంగం, రైతులు సమస్యలే. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను రాహుల్‌గాంధీ స్పష్టంగా వివరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రైతాంగ సంక్షేమంపై వరంగల్‌ డిక్లరేషన్‌ను రాహుల్‌గాంధీ ప్రకటిస్తారని టీపీసీసీ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో డిక్లరేషన్‌పై ఆసక్తి నెలకొంది. 15 రోజులుగా ఏఐసీసీ నుంచి జిల్లా నాయకత్వం వరకు రైతు సంఘర్షణ సభ నిర్వహణ ప్రణాళికలో తలమునకలయ్యారు. ఢిల్లీ నుంచి జిల్లా వరకు నేతలు ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు హనుమకొండకు తరలివస్తూ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. సభ నిర్వహణ కోసం టీపీసీసీ మొత్తంగా 28 కమిటీలను ఏర్పాటు చేసి బాధ్యతలను విభజించింది.

మొత్తమ్మీద సభసక్సెస్ పై పార్టీ శ్రేణులన్నీ ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ఐదు లక్షలమందితో సభ నిర్వహించి వరంగల్ వేదికగా రాహుల్ గాంధీ రాబోయే జనరల్ ఎన్నికలకు సమరశంఖం పూరిస్తారని అందరూ భావిస్తున్నారు. రైతు డిక్లరేషన్ పేరుతో రైతులకు భరోసా కల్పిస్తూనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టి శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపుతారని నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ సభ సక్సెస్ తెలంగాణలో కాంగ్రెస్ కు ఏ మేరకు లాభిస్తుందో చూడాలి. 

Full View


Tags:    

Similar News