అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్న పబ్ లు రెస్టారెంట్లు
Task Force Police: *అధికారుల హెచ్చరికలు పట్టించుకోని నిర్వాహకులు *తాజాగా రాంగోపాల్ పేటలో కస్టమర్లకు ఆకర్షిస్తున్న అనధికారిక పబ్
Task Force Police: పోలీసుల తనిఖీలు.. దాడులు జరుపుతున్నప్పటికీ హైదరాబాద్ సిటీలో పబ్బులు.. శివారులో ఉన్న రిసార్టులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నాయి. అధికారుల హెచ్చరికలు ఏమీ పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు పబ్ నిర్వాహకులు. సమయం దాటిన తర్వాత కూడా పబ్బులను తెరిచి గబ్బు లేపుతున్నారు. తాజాగా రాంగోపాల్ పేటలో గానా బజానాతో కస్టమర్లకు ఆకర్షిస్తూ అనధికారిక పబ్ నిర్వహిస్తున్న క్లబ్ టఖిలా కేఫ్ అండ్ బార్ పై సెంట్రలో జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.
ఇటీవలే సంచలనం సృష్టిన పుడింగ్ అండ్ మింక్ పబ్ ఉదంతం మరువక ముందే నగరంలోని ఇతర పబ్ ల హంగామా రోజు రోజుకు హద్దులు దాటుతున్నాయి. అనుమతి లేకుండా సమయం దాటిన తర్వాత డ్రగ్స్ వినియోగిస్తూ.. అశ్లీల నృత్యాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అనుమతి లేకుండా అర్ధరాత్రి వరకు పబ్ రన్ చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు రైడ్ చేశారు. అప్పటికే అక్కడ ఉన్న 18 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పబ్ ఆర్గనైజర్ తో పాటు 8 మంది కస్టమర్స్, డీజే ఆపరేటర్, మరో ఎనిమిది మంది డ్యాన్సులు చేసే యువతులు ఉన్నారు.
బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో పబ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా అమ్మాయిలతో నిర్వాహకులు డ్యాన్సులు చేస్తున్నట్లు తేలింది. దీంతో పబ్ ను సీజ్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 294, 278 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులకు 41 CRPC నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు. గతంలోనూ టకీల బార్ అండ్ రెస్టారెంట్ పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది.