ఫుడ్ పాయిజన్ ఘటనపై అధికారులు చర్యలు.. ఇకపై స్టాఫ్ చెక్ చేసిన తర్వాతే విద్యార్థులకు భోజనం
Basara IIIT: ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ట్రబుల్స్ తగ్గడం లేదు.
Basara IIIT: ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ట్రబుల్స్ తగ్గడం లేదు. యూనివర్సిటీలోని మెస్ నిర్వాహకుల తీరు మారడం లేదు. భోజనంలో కప్పలు, పురుగులు కనిపిస్తున్నాయని విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. నిన్న ఫుడ్ పాయిజన్ ఘటనతో అధికారుల నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. మధ్యాహ్న భోజనంలో ఎగ్ ప్రైడ్ రైస్ తిన్న సుమారు 12 వందల మంది స్టూడెంట్స్ వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురికావడం ఆందోళన కలిగించింది.
ఫుడ్ పాయిజన్ ఘటనపై విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఎక్స్‌పైర్డ్ ఫుడ్ పెట్టారని ఆరోపించిన విద్యార్థులు ఆ పదార్థాలు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కు చూపించి నిరసనకు దిగారు. యాజమాన్యం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డైరెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నాకి దిగారు.
విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ నేతలు బాసటగా నిలిచారు. ట్రిపుల్ ఐటీలో చొచ్చుకుపోయేందుకు నేతలు, కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఐటీ ప్రధాన ద్వారం వద్దే బఠాయించి నిరసన తెలపడంతో పరిస్థితి ఉదృతంగా మారింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసుల తీరును కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. విద్యార్థులను ఎందుకు కలవనివ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ధర్నాకు బీఎస్పీ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు తెలిపారు. విద్యార్థులు చికిత్స పొందుతున్న నిజామాబాద్ లోని హోప్ హాస్పిటల్ వద్ద ధర్నాకు దిగారు.
ఫుడ్ పాయిజన్ ఘటనపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. విద్యార్థుల అస్వస్థతకు కారణమైన మెస్ కాంట్రాక్టర్లు, ఇన్‌ఛార్జీలపై కేసు నమోదు చేశారు. ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తగా నియామకమైన డైరెక్టర్ సతీష్ కుమార్ తెలిపారు. సోమవారం నుంచి మధ్యాహ్న భోజనం ముందు ఉపాధ్యాయులు తిని చెక్ చేస్తారని చెప్పారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ హామీ ఇచ్చారు.