Private School Teachers Home Tutions: కొత్తబాట పట్టిన 'ప్రైవేటు' మాస్టర్లు!
Private School Teachers Becomes Home Tutors : బడిగంట ఆగిపోయింది. బతుకుపోరాటం మొదలైంది. కరోనా కారణంగా విద్యాసంస్థలకు తాళాలు పడ్డాయి. ప్రైవేట్ ఉపాధ్యాయులు, లెక్చరర్ల జీతాలు నిలిచిపోయి జీవితాలు ప్రశ్నార్థకమయ్యాయి. బతుకుబండిని నడిపించేందుకు ఉపాధ్యాయులు కొత్త రూట్ ఎంచుకున్నారు. ప్రైవేట్ టీచర్స్ ఇప్పుడు ప్రైవేట్ ట్యూటర్స్ గా అవతారమెత్తారు. హోం ట్యూషన్స్ అంటూ విద్యార్థులకు ఊరట కలిగిస్తున్నారు. ఇటు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని హోం ట్యూషన్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. భాగ్యనగరంలో పెరిగిన పోతున్న హోం ట్యూషన్ కల్చర్ పై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ.
కరోనా భూతం రాగానే విద్యావ్యవస్థ స్థంభించిపోయింది. విద్యాసంస్థలకు తాళాలు పడ్డాయి. పిల్లలు చదువులకు దూరమయ్యారు. ఇటు ప్రైవేట్ ఉపాధ్యాయులు, లెక్చరర్లకు కూడా జీతాలు నిలిచిపోయాయి. దీంతో ఉపాధ్యాయులు బతుకుబండిని నడిపేందుకు హోం ట్యూషన్స్ అంటూ ఆఫర్ ఇస్తున్నారు. ఇటు ఆన్ లైన్ క్లాసులు పిల్లలకు అర్థంకాకపోవడంతో చాలా మంది తల్లిదండ్రులు హోం ట్యూషన్లకు ఆసక్తి చూపిస్తున్నారు.
హైదరాబాద్ మహానగరంలో హోం ట్యూషన్ల హవా పెరిగింది. ప్రైవేట్ టీచర్స్ హోమ్ ట్యూటర్లుగా మారుతున్నారు. కరోనా కాలంలో విద్యార్థులకు చదువులు, టీచర్లకు చదివింపులు రావడంతో ఇద్దరికి కాస్త ఊరట కలుగుతోంది. ఇలా నగరంలో దాదాపు 30 వేల మంది టీచర్లు ఉన్నారు. వారంతా ఇప్పుడు హోం ట్యూటర్లుగా మారుతున్నారు. విపత్కర సమయంలో పిల్లలకు చదువు దూరం కాకుండా ఈ హోం ట్యూషన్స్ కాస్త ఉపకరిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదంటున్నారు నిపుణులు. ఏదీ ఏమైనా హోం ట్యూషన్స్ తో పిల్లలే కాదు అటు తల్లిదండ్రులు కూడా సంతృప్తి చెందుతున్నారు.