Prajwal Revanna: నేటి నుంచి ప్రజ్వల్‌ రేవన్నకు పోలీస్ కస్టడీ

Prajwal Revanna: లైంగిక దాడి, బెదిరింపులు, కిడ్నాప్ ఆరోపణలతో అరెస్ట్ అయిన ప్రజ్వల్

Update: 2024-06-01 04:41 GMT

Prajwal Revanna: నేటి నుంచి ప్రజ్వల్‌ రేవన్నకు పోలీస్ కస్టడీ

Prajwal Revanna: మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ సస్పెండెడ్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు ఆరు రోజుల పోలీస్‌ కస్టడీ విధించారు. ఈ మేరకు అశ్లీల వీడియో కేసుపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు విచారణ అనంతరం ఆరురోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతిచ్చింది. ఇక మైసూర్‌లోని కేఆర్ నగర్‌కు చెందిన మహిళ కిడ్నాప్ కేసులో ప్రజ్వల్‌ రేవణ్ణ, హెచ్‌డీ రేవణ్ణ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన బెయిల్‌ను వ్యతిరేకిస్తూ సిట్ కూడా హైకోర్టులో పిటిషన్‌ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు రేవణ్ణ కస్టడీలోనే ఉండాలని, అందుకే బెయిల్‌ను రద్దు చేయాలని సిట్ హైకోర్టును కోరింది. దీనిపై విచారణను హైకోర్టు జూన్ 3కి వాయిదా వేసింది.

కాగా జర్మనీ నుంచి బయల్దేరిన ప్రజ్వల్‌ రేవణ్ణను.. గురువారం అర్ధరాత్రి బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆయనను భారీభద్రత మధ్య విచారణ నిమిత్తం సీఐడీ కార్యాయానికి తరలించారు. శుక్రవారం ఉదయం రేవణ్ణకు బెంగళూరులోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రజ్వల్‌ను సిటీ సివిల్‌ కోర్టుకు తరలించారు. అక్కడ అతన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి.. ప్రజ్వల్‌ను 14 రోజులపాటు తమ కస్టడికి అప్పగించాలని సిట్‌ కోర్టును కోరింది.

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు అయిన ప్రజ్వల్‌ రేవణ్ణ 2014-19లో హాసన్ నుంచి జీడీఎస్‌ తరపున ఎంపీగా గెలుపొందారు. ఈ లోక్‌సభల్లోనూ ఎన్డీఏ కూటమి తరపున. హాసన్ నుంచి మళ్లీ ఎంపీగా బరిలోకి దిగారు. అయితే పలువురు మహిళలపై ఆయన లైంగిక దాడి చేసినట్లు వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆయన గత ఏప్రిల్‌లో దేశం విడిచి పరారయ్యారు. ఇప్పటివరకు రేవణ్ణపై మూడు కేసులు నమోదు అయ్యాయి. ఆయన ఆచూకి కోసం బెంగళూరు పోలీసులు ముమ్మరంగా గాలించారు.

ఆయనపై నాలుగుసార్లు నోటీసులు, ఒక అరెస్టు వారెంటు, బ్లూ కార్నర్, రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. దౌత్య పాస్‌పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగశాఖ చర్యలు చేపట్టింది. విచారణకు హాజరు కావాలని ఆయన తండ్రి హెచ్‌డీ రేవణ్ణ, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ బహిరంగానే కోరారు.

ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసుల విచారణకు సహకరిస్తానని, మే 31న సిట్‌ ముందు హాజరవుతానని ఇటీవల తొలిసారి వీడియో సందేశంలో రేవణ్ణ పేర్కొన్నారు. మరోవైపు బెంగళూరు కోర్టులో రేవణ్ణకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.

Tags:    

Similar News