Priyanka Gandhi: పార్లమెంట్‌లో జూనియర్ ఇందిరా గాంధీ.. మోదీ, అమిత్ ‌షానే టార్గెట్టా?

Priyanka Gandhi: ప్రియాంక గాంధీ జీవితం ఇప్పటివరకు వేరు.. ఇకపై వేరు. ఇప్పటివరకు ప్రపంచం ఆమెను ఇందిరా గాంధీకి మనవరాలిగా, రాజీవ్ - సోనియా గాంధీల కుమార్తెగానే చూస్తూ వచ్చింది.

Update: 2024-11-25 08:26 GMT

Priyanka Gandhi: పార్లమెంట్‌లో జూనియర్ ఇందిరా గాంధీ.. మోదీ, అమిత్ ‌షానే టార్గెట్టా?

Priyanka Gandhi: ప్రియాంక గాంధీ జీవితం ఇప్పటివరకు వేరు.. ఇకపై వేరు. ఇప్పటివరకు ప్రపంచం ఆమెను ఇందిరా గాంధీకి మనవరాలిగా, రాజీవ్ - సోనియా గాంధీల కుమార్తెగానే చూస్తూ వచ్చింది. కానీ ఇప్పుడామె కేరళలోని వయనాడ్ ఎంపీ. ఎంపీ హోదాలో తొలిసారిగా పార్లమెంట్ లో అడుగుపెట్టబోతున్నారు. అందుకే ఇకపై రాజకీయంగా ప్రియాంకా గాంధీ వేసే అడుగులు, ఎత్తుగడలు, పార్లమెంట్ సమావేశాల్లో ఆమె వాగ్ధాటి ఎలా ఉంటాయన్నదానిపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.

కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రియాంకా గాంధీని జూనియర్ ఇందిరా గాంధీ అని పిలుచుకుంటుంటాయి. ఇప్పుడామె పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్నారు. ప్రధానీ మోదీ, అమిత్ షానే టార్గెట్‌గా ఆమె వ్యూహాలకు పదును పెట్టబోతున్నారా అంటే ఔననే అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. అన్న రాహుల్ గాంధీ రాజీనామాతో వయనాడ్‌ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంక వాద్రా.. 4,10,931 ఓట్ల మెజార్టీతో గెలిచి అన్న రికార్డును బ్రేక్ చేశారు. అన్నా చెల్లెలు రాహుల్, ప్రియాంక కలిసి లోక్ సభలో ప్రజా సమస్యలపై పోరాడనున్నారు. ఇన్నాళ్లు సభలు, సమావేశాల్లో బీజేపీపై విమర్శలు చేసిన ప్రియాంక.. ఇక డైరెక్ట్‌గా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా టార్గెట్‌గా తన వ్యూహాలకు పదునుపెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఓ వైపు రాహుల్ గాంధీ, మరోవైపు ప్రియాంక గాంధీతో బీజేపీకి పార్లమెంటులో తిప్పలు తప్పవంటున్నారు కాంగ్రెస్ నేతలు. గతంలో ఎన్నికల ప్రచారంతో బీజేపీ సర్కార్‌ను టార్గెట్ చేసిన ప్రియాంక గాంధీ.. ఇక పార్లమెంటులో జూనియర్ ఇందిరా గాంధీలా తన సత్తా చాటుకుంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేల నాది.. ఈ మట్టి పై నా కుటుంబ రక్తం ఉంది. నేను తలవంచను, వెనక్కి తగ్గను అంటూ పలుమార్లు కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేశారు ప్రియాంక. ఈ మాటలు ఆమె ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించడమే కాదు.. నానమ్మ ఇందిర తెగువను గుర్తు చేస్తున్నాయని ఆ పార్టీ నేతలు చెప్పిన సందర్భాలున్నాయి.

ఆమె చీరకట్టు, పోలికలు, హావభావాలు.. ఇలా చాలా విషయాల్లోనూ నానమ్మ ఇందిరను పోలి ఉంటారు ప్రియాంక. వ్యక్తిత్వం, రాజకీయ వ్యూహాలు, ప్రసంగ నైపుణ్యాలు, రాజకీయ చతురతలోనూ ఇందిరా గాంధీని గుర్తు చేస్తుంటారనేది ఆ పార్టీ నేతల అభిప్రాయం. ప్రేమగా మాట్లాడడమే కాదు.. అవసరమైనప్పుడు కోపాన్ని ప్రదర్శించే తీరు అచ్చం ఇందిరమ్మలాగే ఉంటుందంటారు. అందుకేనేమో ప్రియాంకను జూనియర్ ఇందిరమ్మగా భావిస్తుంటారు.

భావోద్వేగాలను నియంత్రించుకోగలగడం నానమ్మ, అమ్మ నుంచే నేర్చుకున్నానంటారు ప్రియాంక. తండ్రి మరణించినప్పుడే కాదు.. రాజకీయంగా కఠినమైన సవాళ్లను ఎదుర్కొన్న సందర్భాల్లోనూ ధైర్యంగా ఉంటూ అమ్మ, అన్నకు అండగా నిలబడ్డారు. సోనియా అమేథీలో పోటీ చేసినప్పుడు తొలిసారి బహిరంగంగా కనిపించారు ప్రియాంక. అప్పటికి ఆమె వయస్సు 27 ఏళ్లు. నేత చీర.. బాబ్డ్ హెయిర్‌తో అచ్చం ఇందిరమ్మను గుర్తుకు తెచ్చారు. అప్పటి నుంచి ఆమె తమ భవిష్యత్తు నాయకురాలిగా కాంగ్రెస్ నేతలు భావించారు.

2004, 2009 లోక్ సభ ఎన్నికల్లో సోనియా, రాహుల్ తరుపున స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేశారు. తాను ఎప్పుడూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకోలేదు.. కానీ 2014 తర్వాత కాంగ్రెస్ పునరుజ్జీవనానికి కేంద్ర బిందువుగా మారారు. ఆ తర్వాత కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని అక్కడ పార్టీ విజయంలో తన వంతు పాత్ర పోషించారు. తాజా గెలుపుతో ప్రియాంక అందరి దృష్టిని ఆకర్షించారు. వయనాడ్‌ నుంచి ప్రియాంక భారీ మెజార్టీతో గెలవడం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయాల్లో వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో మూడో తరం మహిళ పార్లమెంటులో అడుగుపెట్టడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్ని రోజులు ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ గెలుపు కోసం శ్రమించారు అనే పేరుంది. ఇకపై అన్న రాహుల్ గాంధీతో కలిసి కాంగ్రెస్‌ను కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని పార్టీ వర్గాలు ఆమెపై ఆశలు పెట్టుకుంటున్నాయి. అయితే ప్రియాంక గాంధీ తన నానమ్మ లాగా సక్సెస్‌ఫుల్ పొలిటిషియన్ అవుతారా? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తారా అనేది తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News