Maharashtra New CM: మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం ఏర్పాటులో అజిత్ పవార్ పాత్ర ఏంటి?

Who is Maharashtra new CM: కూటమి నుండి ఇంకా ప్రకటన రాకపోవడంతో మహారాష్ట్రకు కొత్త సీఎం ఎవరు అనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

Update: 2024-11-25 09:09 GMT

Maharashtra New CM

Who is Maharashtra new CM: మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు రోజులు గడిచాయి. మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంతో మరోసారి వారికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం దక్కింది. మొత్తం 288 స్థానాల్లో 132 స్థానాలు బీజేపి గెలుచుకుంది. కూటమిలో మరో రెండు పార్టీలైన ఏక్‌నాథ్ షిండె నాయకత్వంలోని శివసేనకు 57 స్థానాలు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 41 స్థానాలు వచ్చాయి. సంఖ్యా బలం పరంగా చూసుకుంటే 132 స్థానాలతో బీజేపి నేత దేవేంద్ర ఫడ్నవిస్ సీఎం రేసులో ముందున్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు సీఎం ఎవరు అనే విషయంలో మహాయుతి కూటమి ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు.

కూటమి నుండి ఇంకా ప్రకటన రాకపోవడంతో మహారాష్ట్రకు కొత్త సీఎం ఎవరు అనే అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇవాళ సోమవారం కొత్త సీఎం ప్రమాణస్వీకారం ఉంటుందని షిండే వర్గం నేత దీపక్ చెప్పినప్పటికీ పరిస్థితి ఇంకా ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపించడం లేదు. 

బీజేపికి కావాల్సింది 13 మంది ఎమ్మెల్యేలే..

ఎక్కువ సీట్లు వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యం ఉండటం అనేది సర్వసాధారణం. పైగా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 145 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉండగా.. బీజేపికి ఇంకా కావాల్సింది కేవలం 13 మంది ఎమ్మెల్యేలే. ఆ రకంగా చూసుకుంటే దేవేంద్ర ఫడ్నవిస్‌కే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అందరూ భావిస్తున్నారు. కానీ కూటమి నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎలాంటి నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటాయనేదే అందరి మెదళ్లను తొలిచేస్తోన్న అంశం.

ఏక్‌నాథ్ షిండే మనసులో ఏముంది?

రాష్ట్రాన్ని ఈ రెండేళ్లు పాలించిన ముఖ్యమంత్రిగా మరోసారి కూడా ఆ అవకాశం తనకే వస్తే బాగుంటుందని ఏక్‌నాథ్ షిండే కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ విషయం నేరుగా తన మాటగా చెప్పకుండా, ఆయన తన వర్గం నేతలతో చెప్పిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. తమ నాయకుడు షిండే ఈ రెండేళ్లలో రాష్ట్రాన్ని అన్నివిధాల అభివృద్ధిలోకి తీసుకెళ్లారని వారు చెబుతున్నారు.

మహాయుతి కూటమి ఇంత ఘన విజయం సాధించడానికి షిండే పరిపాలనే కారణమని షిండే వర్గం నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే తమ నాయకుడికే సీఎం అయ్యే అవకాశం ఇవ్వాలని షిండె వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. షిండే మనసులో మాట కూడా అదే అనడానికి వారు చేస్తోన్న డిమాండే నిదర్శనంగా విశ్లేషకులు చెబుతున్నారు. మహాయుతి కూటమి అంత ఘన విజయం సాధించినప్పటికీ వారిలో సీఎం ఎవరు అనే ప్రకటన చేయడానికి ఆలస్యం అవడానికి కారణం అదే అనేది విశ్లేషకుల అభిప్రాయం.

ఇంతకీ అజిత్ పవార్ మనసులో ఏముంది?

మహారాష్ట్ర సీఎం సీటు కోసం దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్‌నాథ్ షిండె పోటీపడుతున్నారు. మరి వారి మిత్రపక్షమైన అజిత్ పవార్ ఎవరి వైపు ఉంటారనేదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. అయితే, ప్రస్తుత పరిస్థతుల దృష్ట్యా అజిత్ పవార్ రిస్క్ తీసుకోదలుచుకోలేదని తెలుస్తోంది. ఎక్కువ సీట్లు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటుకు అడుగు దూరంలోనే ఉన్న దేవేంద్ర ఫడ్నవిస్ వైపే అజిత్ పవార్ ఉన్నట్లు సమాచారం. 

మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో ఏక్‌నాథ్ షిండే గురించి ఉద్ధవ్ థాకరే ఏమన్నారో తెలియాలంటే ఇదిగో ఈ వీడియో చూడండి

Full View

Tags:    

Similar News