Sambhal Mosque Survey: యూపీలో మరోసారి చెలరేగిన హింస.. ముగ్గురి మృతి, 30 మంది పోలీసులకు గాయాలు
Sambhal Mosque Survey Incident: ఉత్తర్ ప్రదేశ్‌లో మరోసారి హింస చెలరేగింది. కోర్టు ఆదేశాలతో సంభాల్‌లో జమా మసీదులో పోలీసులతో పాటు సంబంధిత అధికారులు సర్వే చేస్తుండగా ఈ ఘటన జరిగింది. మొరాదాబాద్ డివిజనల్ కమిషనర్ ఆంజనేయ కుమార్ సింగ్ వెల్లడించిన కథనం ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అధికారులు మసీదులో సర్వే పూర్తి చేసుకుని వస్తుండగా మూడు వైపుల నుండి భారీ సంఖ్యలో జనం మసీదు వైపు చొచ్చుకుని వచ్చారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారిపై మూడువైపుల నుండి రాళ్లు రువ్వుతూ దాడికి దిగారు.
వారిని నిరోధించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. రబ్బర్ బుల్లెట్స్ ను పేల్చి అల్లరి మూకలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. మరోవైపు ఇంకొంతమంది జనం అక్కడే ఉన్న అధికారుల వాహనాలకు నిప్పుపెట్టడం మొదలుపెట్టారు. ఈ దాడిలో పోలీసు పీఆర్వో అధికారికి, డిప్యుటీ కలెక్టర్ కు గాయాలయ్యాయి. అంతేకాకుండా మరో 30 మంది అధికారులకు గాయాలయ్యాయి. కాల్పుల్లో మరో ముగ్గురు చనిపోయినట్లు తెలిపారు. చనిపోయిన వారిని నయీం, బిలాల్, రుమాన్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి పరిస్థితి పూర్తి అదుపులోనే ఉందని మొరాదాబాద్ డివిజనల్ కమిషనర్ అన్నారు. తాము వారి ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
అసలేంటీ మసీదు వివాదం.. సర్వే ఎందుకు చేశారు
మొఘల్ శకం నాటి మసీదుపై చాలా ఏళ్లుగా స్థల వివాదం నడుస్తోంది. అక్కడ గతంలో హిందూ దేవాలయం ఉండేదని, అదే స్థలంలో ఈ మసీదు నిర్మించారని అక్కడి హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. మొఘల్ చక్రవర్తి బాబర్ హయాంలో 1529 లో ఈ విధ్వంసం జరిగిందనేది పలు హిందూ సంఘాల ఆరోపణ. సర్వే చేపట్టి అసలు నిజం ఏంటో తేలిస్తేనే అసలు చరిత్రాక నిజాలు ఏంటో కూడా బయటపడుతుందనేది ఈ వివాదానికి మద్దతిచ్చే వారి వాదన.
అయితే, దీనిని వ్యతిరేకించే వారి వాదన మరోలా ఉంది. ఇది కేవలం కొంతమంది రెచ్చగొట్టడం వల్లే జరుగుతోందని వారు చెబుతున్నారు. పైగా ప్రార్థనా స్థలాల పవిత్రతను కాపాడే ఉద్దేశంతో వచ్చిన 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుందని వారు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. మొత్తానికి ఈ వివాదం కోర్టు వరకు వెళ్లడంతో కోర్టు సర్వే చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించింది. అందులో భాగంగానే అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని సర్వే చేపట్టిన సందర్భంలోనే స్థానికుల నుండి ఈ తిరుగుబాటు కనిపించింది.