Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు పాస్ పోర్టు రద్దు.. రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఏంటి?

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల పాస్ పోర్టులను రద్దు చేశారు.

Update: 2024-10-26 06:15 GMT

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు పాస్ పోర్టు రద్దు.. రెడ్ కార్నర్ నోటీస్ అంటే ఏంటి?

Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల పాస్ పోర్టులను రద్దు చేశారు. వీరిద్దరి పాస్ పోర్టులను రద్దు చేయాలని తెలంగాణ పోలీసుల వినతిమేరకు పాస్ పోర్టు అథారిటీ రద్దు చేసింది.

వీరిద్దరూ అమెరికాలో ఉన్నట్టుగా తెలంగాణ పోలీసులు గుర్తించారు. పాస్ పోర్టుల రద్దు తో వీరిద్దరిని హైద్రాబాద్ కు రప్పించడం సులభమని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావుల పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పాస్ పోర్టులు రద్దు చేసిన విషయం అమెరికా అధికారులకు సమాచారం ఇస్తే అక్కడి అధికారులు వీరిద్దరిని ఇండియాకు పంపడం సులువు అవుతుందని పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పాస్ పోర్ట్ రద్దుకు సంబంధించిన సమాచారాన్ని సీబీఐ అధికారులు ఇంటర్ పోల్ కు నివేదిక పంపారు. మరో వైపు వీరిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని పోలీసులు భావిస్తున్నారు.

రెడ్ కార్నర్ నోటీస్ జారీ అంటే ఏంటి?

మోస్ట్ వాంటెడ్ వ్యక్తుల కోసం దీన్ని జారీ చేస్తారు. నిందితుడు ఏ దేశంలో ఉన్నా అతడిని ఆచూకీని గుర్తించి అరెస్ట్ చేస్తారు.ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాల్లో దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంతర్జాతీయంగా వాంటెడ్ గా ఉన్న ఈ పారిపోయిన వారి గురించి స్థానిక దేశాల బలగాలను అప్రమత్తం చేస్తోంది. పేరు, పుట్టినతేదీ, జాతీయత, జుట్టు రంగు, కళ్లు, మొదలైన శారీరక లక్షణాలతో పాటు చిత్రాలు, బయోమెట్రిక్ సమాచారాన్ని కూడా ఈ నోటీస్ లో ఉంటాయి. ఈ సమాచారం మోస్ట్ వాంటెడ్ పర్సన్ ను గుర్తించేందుకు వీలుంటుంది. నేరం జరిగిన దేశం అభ్యర్ధన మేరకు ఇంటర్ పోల్ వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులు, ట్రిబ్యునల్లు కూడా ఈ నోటీసులు జారీ చేయాలని కోరవచ్చు. ఇది అంతర్జాతీయ అరెస్ట్ వారెంట్ కాదు. ఇది ఒక వ్యక్తి ఆచూకీని గుర్తించి తాత్కాలికంగా అరెస్ట్ చేయాలని అభ్యర్ధన మాత్రమే.

రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తే వారిద్దరిని అమెరికాలోనే ప్రొవిజనల్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దర్యాప్తు అధికారుల అభ్యర్ధనను అమెరికా పోలీసులు పరిగణనలోకి తీసుకుంటే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. తొలుత ప్రొవిజనల్ అరెస్ట్ చేసి స్థానికంగా న్యాయస్థానంలో హాజరుపర్చి భారత్ కు పంపొచ్చు. ఈ విషయాన్ని దర్యాప్తు అధికారులకు సమాచారం ఇస్తారు. అదే జరిగితే భారత్ లోని ఏ విమానాశ్రయంలో దిగినా అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆపి దర్యాప్తు అధికారులకు అప్పగించాల్సి ఉంటుంది. జూన్ 26న హైద్రాబాద్ కు వస్తానని ప్రభాకర్ రావు చెప్పారు. న్యాయస్థానానికి చెప్పారు. క్యాన్సర్ చికిత్స కోసం అక్కడే ఉండాల్సి వస్తోందని చెప్పారు.

రెడ్ కార్నర్ నోటీసుకు సీబీఐకి వినతి

ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై 2024, మార్చి 10న కేసు నమోదైంది. ఈ కేసు నమోదైన తర్వాత వీరిద్దరూ విదేశాలకు వెళ్లిపోయారు. దీంతో వీరిని విచారించలేదు. విచారణకు రావాలని పోలీసులు మెయిల్ ద్వారా సంప్రదించారు. ఆరోగ్య సమస్యలను చూపుతూ ప్రభాకర్ రావు అమెరికాలోనే ఉన్నారు. ఈ కేసులో ఆరుగురిలో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐబీ ఓఎస్డీగా ఉన్న ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చిందని విచారణలో నిందితులు చెప్పారని ప్రచారం సాగుతోంది. దీంతో ప్రభాకర్ రావును విచారిస్తే ఈ కేసులో కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరో వైపు శ్రవణ్ రావును కూడా అమెరికా నుంచి రప్పించేందుకు వీరిద్దరిపై తెలంగాణ పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు సీబీఐకి నివేదిక పంపారు. ఈ నివేదికను ఆమోదించిన సీబీఐ ఇంటర్ పోల్ కు పంపింది. త్వరలోనే వీరిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

Tags:    

Similar News