జహీరాబాద్‌లో విస్తీర్ణంగా ఆలుగడ్డ సాగు.. తేమ ఎక్కువగా ఉండటంతో తగ్గిన దిగుబడి

ధర కూడా తగ్గడటంతో ఆలు రైతులు దిగులు.. తమను ప్రభుత్వం ఆదుకోవాలంటున్న రైతులు

Update: 2022-01-09 07:51 GMT

జహీరాబాద్‌లో విస్తీర్ణంగా ఆలుగడ్డ సాగు... తేమ ఎక్కువగా ఉండటంతో తగ్గిన దిగుబడి

Potato Farmers: ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఆలుగడ్డ సాగుకు జహీరాబాద్‌ ప్రాంతం పెట్టింది పేరు. ఇక్కడ సాగుకు అనువైన నేల ఉండటం మిగతా పంటల కంటే తక్కువ సమయంలో పంట చేతికి వచ్చే అవకాశం ఉండటంతో ఈ ప్రాంత రైతులు ఆలుగడ్డ సాగుకు ఆకర్షితులవుతున్నారు. మొత్తానికి ఈ ప్రాంతంలో ఈ ఏడాది 3వేల 500ఎకరాల్లో ఆలుగడ్డ సాగయింది.

ఒక ఎకరంలో ఆలుగడ్డ సాగుకు 60వేల రూపాయల పెట్టుబడి పెట్టారు రైతులు. అయితే అన్ని పరిస్థితులు అనుకూలిస్తే ఎకరానికి సాధారణంగా 90 నుండి వంద క్వింటాల్‌ ఆలుగడ్డ దిగుబడి వస్తుంది. ఇక మార్కెట్‌లో ఆలుకు కనీస ధర క్వింటాల్‌కు 1200 ఉంటే పెట్టుబడి కష్టం పోనూ రైతులకు ఎంతో కొంత లాభం ఉంటుంది.

భూమిలో తేమ తక్కువగా ఉండి, చలి ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఆలుగడ్డ దిగుబడి బాగుంటుంది. కానీ ఈసారి వర్షాలు ఎక్కువగా పడటంతో పంట దిగుబడి గణనీయంగా తగ్గింది. అంతేకాదు ఎకరాకు కేవలం 60 నుండి 70 క్వింటాల్‌ మాత్రమే దిగుబడి వచ్చింది. ధర కూడా మార్కెట్‌లో వేయి రూపాయలు మాత్రమే ఉండటంతో ఆలూ రైతులు తలలు పట్టుకుంటున్నారు. దిగుబడి తగ్గిపోయి, అటు ధర తగ్గిపోవడంతో అప్పుల పాలవుతామని రైతులు ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం తమను ఎలాగైనా ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఆలూకు కనీస మద్దతు ధర వేయి 300 నుండి వేయి 500 రూపాయలు నిర్ణయించాలని కోరుతున్నారు. ధర తగ్గినప్పుడు ఆలుగడ్డ నిల్వ ఉంచేందుకు జహీరాబాద్‌ ప్రాంతంలో ప్రత్యేక కోల్డ్‌ స్టోరేజ్‌లు నిర్మించాలని విజ్నప్తి చేస్తున్నారు.

Tags:    

Similar News