పోస్టుమెట్రిక్ విద్యార్థులకు గుడ్ న్యూస్ :స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తుల స్వీకరణ
పోస్టుమెట్రిక్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. 2020-21 విద్యా సంవత్సరానికి గాను నేటి నుంచి అంటే అక్టోబర్ 14వ తేది నుంచి పోస్టుమెట్రిక్ విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం చేయనుంది. ఈ దరఖాస్తులను కొత్తగా కోర్సులో చేరిన విద్యార్ధులు అప్లై చేసుకోవడంతో పాటు ఇప్పటికే కోర్సులో చేరిన విద్యార్ధులు రెన్యువల్ చేసుకోవడానికి కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.
అర్హులైన పోస్టుమెట్రిక్ విద్యార్థులంతా ఈ-పాస్ వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఈ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ డిసెంబర్ 31 వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. డిసెంబర్ 31 నాటికి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో తప్పకుండా సమర్పించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తెలిపారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://telanganaepass.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. కాలేజీ యాజమాన్యాలు కూడా ఈ-పాస్ నమోదుపై ప్రత్యేక చొరవ తీసుకుని త్వరితంగా దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని సూచించారు.
ఇక మరో వైపు టీఎస్‌ఆర్‌జేసీ-సెట్ పరీక్షల ఫలితాలను కూడా వచ్చాయి. ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రథమ సంవత్సర ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను నేడు ప్రకటించారు. తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్‌ఆర్‌జేసీ-సెట్) ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను https://tsrjdc.cgg.gov.in/ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
బైపీసీలో 1,440, ఎంపీసీలో 1,500, ఎంఇసీలో 60 సీట్లు అందుబాటులో ఉన్నాయని సొసైటీ కార్యదర్శి ఎస్ వెంకటేశ్వర్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఈ సీట్లను భర్తీ చేసేందుకు గాను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్(టీఆర్ఈఐ) సొసైటీ పరిధిలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లోని 3 వేల సీట్లకు ఈ పరీక్షను నిర్వహించారు. ఎంపీసీ విభాగంలో ఈ నెల 19న అదేవిధంగా బైపీసీ, ఎంఇసీ విభాగాలకు ఈ నెల 20న కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నట్లు వెల్లడించారు.