poor students facing problems with online classes : జూలై మాసంలో అడుగు పెట్టినప్పటికీ ఈ ఏడు విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదు. కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చడంతో ఓ వైపు సడలింపులతో దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతుండగానే మరోవైపు ఇదే అదునుగా భావించిన కొన్ని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఆన్ లైన్ క్లాసుల పేరిట దండుకుంటున్నాయి. హైదరాబాద్ లో ఆన్ లైన్ క్లాసుల పేరిట జరుగుతోన్న ప్రైవేట్ స్కూల్స్ పోకడలపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ.
లాక్ డౌన్ నేపథ్యంలో జీవో 46 ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫీజులు పెంచరాదని, ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకోవాలని, అది కూడా ఇన్ స్టాల్ మెంట్ రూపంలో చెల్లించే వెసులుబాటు విద్యార్థుల తల్లిదండ్రులకు కల్పించాలని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించిన స్కూల్స్ యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
మరోపక్క దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా గత మూడు మాసాలుగా విద్యార్థులందరూ చదువులకు దూరమయ్యారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తే విద్యార్థులకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్తున్నారు. అయితే కంప్యూటర్, ఇంటర్ నెట్ వంటి సదుపాయాలను సమకూర్చుకోలేని పేద విద్యార్థులకు మాత్రం ఆన్ లైన్ క్లాసుల నిర్వహణతో కొంతవరకు నష్టపోయే ప్రమాదం ఉందంటున్నారు.
ఏదేమైనా ఆన్ లైన్ క్లాసుల నిర్వహణతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యా అందరికీ అందుబాటులో ఉండాలని అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవాలని కోరుతున్నారు.