రేషన్ బియ్యం..రెక్కలు కట్టుకుని పక్క రాష్ట్రాలకు.. ఎండుతున్న పేదల డొక్కలు..నిండుతున్న పెద్దల జేబులు!

Update: 2020-09-29 10:15 GMT

పేదలకు ఆకలిని తీర్చాల్సిన రేషన్ బియ్యం రెక్కలు కట్టుకొని రాష్ట్రాలు దాటిపోతోంది. పేదల కడుపులు నింపాల్సిన బియ్యం పెద్దల జేబుల్ని నింపుతోంది. నిరుపేదల కడుపులు కాల్చి ధన దాహాన్ని తీర్చుకుంటున్నారు బియ్యం దోపిడిదారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిత్యం కొనసాగుతున్న అక్రమ రేషన్ బియ్యం రవాణాపై హెచ్ఎమ్టీవీ ప్రత్యేక కథనం.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రేషన్ బియ్యం అక్రమంగా తరలించే మాఫియాకు కేంద్ర బిందువుగా మారింది. పేదల కడుపులు నింపేందుకు తెలంగాణ సర్కార్ సరఫరా చేస్తున్న బియ్యం అడ్డదారులు తొక్కుతోంది. ప్రతినెల ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి మహారాష్ట్రకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. కొంతమంది వ్యక్తుల్ని కేవలం ఇదే పని కోసం ఏర్పాటు చేసుకొని దందాను నడుపుతున్నారు అక్రమార్కులు. అలాగే కొందరు రేషన్ డీలర్లు డైరెక్టుగా మాఫియాకు పీడీఎస్ రేషన్ బియ్యాన్ని అమ్ముతున్నారు. ఒకనెల లబ్దిదారులకు బియ్యం సరఫరా చేస్తే, మరొక నెల అక్రమంగా వేల క్వింటాళ్ల బియ్యం అమ్ముకుంటున్నారు. ఈ బియ్యన్ని మాఫియా కొనుగోలు చేసే స్థావరాలకు తిన్నగా తరలిస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన బియ్యం నిల్వ ఉంచడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేక రైస్ మిల్లులున్నాయంటే పరిస్థితి ఏ మేర దిగజారి ఉందో అర్ధమవుతోంది.

అక్రమంగా నిల్వ ఉంచే రైస్ మిల్లులోనే వాటిని పాలిసింగ్ చేస్తారు. పాలిసింగ్ చేసిన తర్వాత ఆ బియ్యాన్ని కొత్తగా సంచులలో నింపుతారు. అసలు రేషన్ బియ్యమేనా అనే అనుమానం కలిగేలా తయారు చేసి సంచులలో నింపి ప్యాక్ చేస్తారు. తర్వాత వాటిని లారీలలో, వ్యాన్ లలో పాటు భారీ కంటైనర్ వ్యాన్ లలో తరలిస్తారు. ఒక్క మంచిర్యాల పట్టణం నుండి ప్రతిరోజు యాబై లారీలు మహారాష్ట్రలోని చంద్రపూర్, నాగ్ పూర్, యవత్మాల్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇదే స్థాయిలో మిగతా పట్టణాల నుంచి కూడా మహారాష్ట్రలోని ఈ ప్రాంతాలకు బియ్యం అక్రమంగా తరలిపోతున్నాయి. ఈ దందా కోసం మంచిర్యాల జిల్లాలోని లక్షిట్ పెట్, మంచిర్యాల, బెల్లంపల్లి కుమ్రంబీమ్ జిల్లాలోని అసిపాబాద్, కాగజ్ నగర్ ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, ఉట్నూర్ నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్, నిర్మల్, బైంసా స్థావరాలుగా ఏర్పాటు చేసుకున్నారు అక్రమార్కులు.

హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల నుంచి కూడా అక్రమ బియ్యం ఆదిలాబాద్ చేరుకుంటుంది. ప్రణాళిక ప్రకారం మాఫియా ఇక్కడి నుంచి మహారాష్ట్రకు తరలిస్తుంది. లబ్ధిదారుల నుంచి కిలో బియ్యం ఐదు రూపాయలకు కొనుగోలు చేసి, దాన్నే పాలిష్ చేసి మహారాష్ట్రలో ముప్పై రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇలా నెల తిరిగే సరికి వందల కోట్లు కొల్లగొడుతున్నారని పోలీసుల అంచనా.

పేదల బియ్యం అక్రమంగా తరలించడం నిషేధం. కానీ ఇక్కడ రాష్ట్రాలే దాటిపోతుండం విశేషం. ఈ మధ్యనే తాండూర్ పట్టణం మీదుగా ఎనిమిది లారీలలో బియ్యం అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు సీజ్ చేసారు. ఐతే ఈ వ్యవహారాన్ని అధికారులు కూడా పట్టించుకోవడం లేదనే అభియోగాలున్నాయి. అప్పుడప్పుడు తూతూ మంత్రంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారని జనం విమర్శిస్తున్నారు. ఇలా రేషన్ బియ్యం లూటీ చేసి కోట్లు సంపాదిస్తున్న అక్రమార్కులపై కఠినమైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు సర్కార్ ను కోరుతున్నారు.

Tags:    

Similar News