Khammam: ఖమ్మం జిల్లాలో కానరాని పాలిటెక్నిక్ కాలేజ్
Khammam: పాలిటెక్నిక్ చేయాలనుకునే జిల్లా విద్యార్థులకు తప్పని నిరాశ
Khammam: ఉపాధి అవకాశాలకు మార్గం చూపే పాలిటెక్నిక్ డిప్లొమో కోర్సులు విద్యార్థులకు అందనంతదూరమయ్యాయి. పదోతరగతి తర్వాత యువకులు ఉపాధి కోర్సులకు నోచుకోవడం లేదు. జిల్లా కేంద్రమైన ఖమ్మంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లేకపోవడంతో యువత ఉపాధి అవకాశాలను అందుకోలేకపోతోంది. పేద విద్యార్థులు ప్రవేట్ కళాశాల్లో చేరే స్తోమత లేక చదువుకోవాలనే ఆశ చంపుకోలేక సతమతమవుతున్నారు.
ఖమ్మం జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఐతే జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నీక్ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు మూడేళ్ల డిప్లొమా కోర్సులు చేయడానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యటపాక, రుద్రంపూర్‌లో పూర్తిస్థాయి పాలిటెక్నిక్ కళాశాలలు ఉండేవి. ప్రస్తుతం యటపాక ఆంధ్రాప్రాంతానికి వెళ్లగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ మాత్రమే ఉంది. అయితే అది కూడా పక్క జిల్లా కావడంతో ఖమ్మం జిల్లాలో పూర్తిస్థాయి సాంకేతిక డిప్లొమా విద్యను అందించే కళాశాలలు అందుబాటులో లేకుండా పోయాయి.
ఖమ్మంలో ఒక ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాల ఉండగా అందులో కొద్దిమేర మాత్రమే కన్వీనర్ కోటా సీట్లు అందుబాటులో ఉన్నాయి. పూర్తిస్థాయిలో పదుల సంఖ్యలో డిప్లొమా కోర్సులు అందించడం లేదు. ఖమ్మం జిల్లాలో ప్రతీ ఏడాది సుమారు 20వేల మందికి పైగా విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసుకుంటున్నారు. వారంతా ఇంటర్మీడియెట్ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నారు. స్థానికంగా ఐటీఐలు ఉన్నప్పటికీ వాటికంటే ఎంతో గొప్పగా సాంకేతిక విద్యను అందించే పాలిటెక్నిక్ కళాశాలల కొరత వేదిస్తాంది.
ప్రస్తుతం పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం కోసం నోటిఫికేషన్ వెలువడగా, వచ్చే నెలలోప్రవేశ పరీక్ష నిర్వహించి ర్యాంకుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. అయితే ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల లేకపోవడం విద్యార్థులపాలిట శాపమైంది. ఖమ్మంలోని ప్రైవేటు కాలేజీతో పాటు ఇతర ప్రాంతాల్లోని డిప్లొమా కాలేజీల్లో చేరడానికి వేలాది రూపాయలు ఫీజులుగా మూడేళ్ల పాటు వెచ్చించాల్సి వస్తోంది. జిల్లాలో అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ మినహా.. కంప్యూటర్, మెకానికల్, సివిల్, ఎలక్రికల్, ఎలక్ర్టానిక్ తదితర కోర్సులు అందించడానికి ప్రభుత్వ కళాశాల లేకుండా పోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు మదనపడుతున్నారు. ఉన్న ఒక్క ప్రైవేటు కళాశాలలో కూడా నామమాత్రంగానే కోర్సులు ఆఫర్ చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాల ఏర్పాటైతే నిష్ణాతులైన అధ్యాపకులు బోధనలో విద్యార్థులకు లాభం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విద్యార్థులకు ఉపాధికి మార్గం చూపించే పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకోసం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు చొరవ చూపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మరి ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందో లేదో చూడాలి.