రాజకీయ కక్ష్యలకు వేదికగా ఖమ్మం..? మాటలతో కత్తులు దూసుకుంటున్న అధికార, విపక్షాలు
Khammam: జిల్లాలో కలకలం రేపుతున్న సాయి గణేష్ ఆత్మహత్య...
Khammam: ఉద్యమాల ఖిల్లా ఖమ్మం(Khammam) జిల్లా రాజకీయ కక్ష్యలకు వేదికగా మారుతుందని టాక్ వినిపిస్తోంది. అధికార, విపక్షాల మధ్య విమర్శలకే పరిమితమైన రాజకీయాలు.. ఇప్పుడు కేసులు, పరస్పర దాడులకు కారణమవుతున్నాయని ఆ జిల్లా ప్రజలే చెబుతున్నారు. అంతేకాదు.. అధికార పార్టీ పోలీస్ శాఖను అడ్డుపెట్టుకుని తమను అనగదొక్కేందుకు అక్రమ కేసులు బనాయిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
మొత్తానికి తనను పోలీసులు వేధిస్తూన్నారంటూ బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పోలీసుల సహాయంతో సాయి గణేష్ ఆత్మహత్య చేసుకునేలా టీఆర్ఎస్ నేతలు ప్రేరేపించినట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అటు సాయి గణేష్ మరణ వాంగ్మూలం కూడా బయటకు రావడంతో ప్రభుత్వం బాధ్యత వహించాలని బీజేపీ(BJP) డిమాండ్ చేస్తుంది.
మరోవైపు ఖమ్మం జిల్లాలో సాగుతున్న ప్రతీకార రాజకీయాలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) స్పందించారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలపై అధికార పార్టీ కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మంత్రి పువ్వాడ అజయ్(Puvvada Ajay Kumar).. కాంగ్రెస్ కార్యకర్తలను టార్గెట్ చేస్తూన్నాడని జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
ఇక కాంగ్రెస్, బీజేపీ శవ రాజకీయాలు చేస్తున్నాయంటున్నారు టీఆర్ఎస్ నేతలు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ చేస్తున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేకనే ఆరోపణలు చేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. మొత్తానికి జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అధికార, విపక్షాల మధ్య జరుగుతున్న రాజకీయ కక్ష్య సాధింపు చర్యలు రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయో అనే ఆందోళన జిల్లా వాసుల్లో వ్యక్తమవుతోంది.