TRS vs BJP: టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య వరి వార్‌.. హీటెక్కిన రాజకీయాలు

TRS vs BJP: వరి ధాన్యం కొనుగోలుపై బీజేపీ వైఖరిపై నిరసన సిరిసిల్లలో కేటీఆర్‌, సిద్దిపేటలో హరీష్‌రావు...

Update: 2021-11-12 03:38 GMT

TRS vs BJP: టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య వరి వార్‌.. హీటెక్కిన రాజకీయాలు

TRS vs BJP: హుజూరాబాద్‌ ఉపఎన్నిక తర్వాత తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ వరుస ప్రెస్‌మీట్లు పెట్టడం, తెలంగాణ బీజేపీ నేతలు, కేంద్రాన్ని టార్గెట్‌ చేస్తూ వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారానికి తెరలేపాయి. ఇక.. వరి ధాన్యం కొనుగోలుపై ఇటు టీఆర్‌ఎస్‌, అటు బీజేపీ మధ్య వార్‌ తారాస్థాయికి చేరుకుంది.

తప్పు మీదంటే మీదంటూ ఇరుపార్టీలు విమర్శనాస్త్రాలు సంధించుకున్నాయి. వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ.. గులాబీ నేతలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునివ్వగా.. కమల నాథులు ఒకరోజు ముందే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని కలెక్టరేట్‌ల ఎదుట ఆందోళనలు చేపట్టారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా పాలిటిక్స్‌ వేడెక్కాయి.

వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం వైఖరిని ఎండగడుతూ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు గులాబీ సైన్యం సిద్ధమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ధర్నాలు చేసేందుకు టీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేసింది. వరి ధాన్యం కొనుగోలుపై సమస్య తీవ్రతను చాటేలా ధర్నాలు నిర్వహించాలని పార్టీ నేతలకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచించారు.

మరోవైపు.. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున.. అన్ని జిల్లా కలెక్టర్ల నుంచి ఆయా జిల్లా నేతలు ముందస్తు అనుమతి తీసుకున్నారు. అన్ని నియోజకవర్గాల పరిధిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు.. ఆయా నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో ఆందోళనలు చేయనున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 3వేల మందికి తక్కువ కాకుండా నిరసనలో పాల్గొనేలా వ్యూహరచన చేశారు.

ఇక.. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద నగర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఆందోళనలో పాల్గొననున్నారు. సిరిసిల్లలో కేటీఆర్‌, సిద్దిపేటలో హరీష్‌రావు, కరీంనగర్‌లో గంగుల కమలాకర్‌, హన్మకొండలో ఎర్రబెల్లి, వనపర్తిలో నిరంజన్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్‌ గౌడ్‌, ఖమ్మంలో పువ్వాడ అజయ్‌, నిర్మల్‌లో ఇంద్రకరణ్‌రెడ్డి, సూర్యాపేట జిల్లాలో జగదీశ్‌రెడ్డి ఆందోళనల్లో పాల్గొననున్నారు.

ఇప్పటికే ధర్నాలకు పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు రైతులను కూడా భారీగా సమీకరించాలని సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3లక్షల మంది రైతులు, గులాబీ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

కేంద్రం ధాన్యం కొనేవరకు తమ పోరాటం ఆగదని.. ఈ నిరసనల ద్వారా చాటిచెప్పాలని టీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. రైతు వ్యతిరేక చట్టాలను ప్రోత్సహించేందుకే కేంద్రం.. ధాన్యం కోనుగోలు చేయట్లేదని ఆరోపిస్తున్నారు. పంజాబ్‌లో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న కేంద్రం.. తెలంగాణ ధాన్యాన్ని ఎందుకు కొనదో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రైతు సమస్యలు అద్దంపట్టేలా అవసరమైతే ఢిల్లీలోనూ ధర్నా చేయాలని గులాబీ పార్టీ భావిస్తోంది. దేశవ్యాప్తంగా పలు పార్టీలను ఈ నిరసనల్లో భాగస్వామ్యం చేసేందుకు ఎత్తుగడలను సిద్ధం చేస్తోంది. 

Tags:    

Similar News