సాయి గణేష్ మృతిపై రాజకీయ వేడి.. కౌంటర్ అటాక్‌కు దిగిన టీఆర్ఎస్...
Khammam: *అధికార, విపక్షల నేతల మధ్య మాటల యుద్ధం *సీబీఐ విచారణకు విపక్షాల డిమాండ్
Khammam: బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య ఖమ్మం జిల్లా రాజకీయాల్లో వేడి పుట్టిస్తోంది. అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నేతల వరుస పర్యటలను గల్లీ నుంచి ఢిల్లీ వరకు చర్చనీయాంశంగా మారాయి.
ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త సూసైడ్‌తో కారు వర్సెస్ కమలం మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ఇటు హస్తం పార్టీ ఎంట్రీ ఇవ్వడంతో టీఆర్‌ఎస్ అటాక్‌కు దిగింది. సాయి గణేష్ మృతికి మంత్రి పువ్వాడ అజయ్ కారణమంటూ బీజేపీ శ్రేణులు ధ్వజమెత్తుతున్నాయి. ఆందోళనలు, నిరసనలతో బీజేపీ కార్యకర్తలు హోరెత్తించారు. సాయిగణేష్ ఆత్మహత్య ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో దీక్ష చేపట్టారు.
మరోవైపు కేంద్ర నాయకత్వం బరిలోకి దిగింది. హోంమంత్రి అమిత్ షా కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, చంద్రశేఖర్ సాయిగణేష్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. సాయి గణేష్ మృతిపై కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. ఘటనపై కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు.
కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి పువ్వాడపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్త మృతిపై కొన్నాళ్లు మౌనంగా టీఆర్ఎస్ కౌంటర్ అటాక్ చేసింది. వైరాలో జరిగిన కమ్మ సంఘం కార్యక్రమంలో మంత్రి అజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న విషయాన్ని సాకుగా తీసుకుని తనను మంత్రి వర్గం నుంచి తొలగించేందుకు కొందరు సూడో చౌదరిలు ప్రయత్నం చేస్తున్నారని చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపాయి.