నిత్యం శాంతి భద్రతల పరిరక్షణతో నిమగ్నం, కరోనా నియంత్రణలో ముందుడి సేవలు ఇలా విశ్రాంతి లేకుండా సేవలు అందిస్తున్న పోలీసులు తమ మానవత్వాన్ని కూడా చాటుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రతి ఒక్కరి కడుపు నింపేందుకు కృషి చేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. తాజాగా ఎవరూ లేక ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఓ వృద్ధురాలికి ఆశ్రయం కల్పించి, నిత్యావసర వస్తువులు అందించారు పోలీసులు.
కొద్ది రోజుల క్రితం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు నగరంలో కొన్ని పురాతన ఇళ్ళు కూలిపోయే పరిస్థితికి వచ్చాయి. జిహెచ్ఎంసీ అధికారులు పోలీసుల సాయంతో ఇలాంటి ఇళ్ళు గుర్తించే పనిలో ఉన్నారు. ఇదే క్రమంలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో, ఖైరతాబాద్ డివిజన్‌లోని తుమ్మలబస్తీలో నాలా ప్రక్కన ఓ ఇంటి గోడ కూలిపోయి ఉండటం గమనించారు. ఆ ఇంటిలో మనుషులు ఉంటారని ఊహించని కానిస్టేబుళ్లకు లోపల ఓ 70 ఏళ్ల వృద్ధురాలు కనిపించింది. కదలలేని స్థితిలో ఉన్న ఆమెను చూసి చలించిపోయారు. స్థానికుల ద్వారా వివరాలు సేకరించి వృద్ధురాలు యాదమ్మగా గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
సైఫాబాద్ పోలీస్టేషన్ లో డిటెక్టివ్ ఇన్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న రాజు నాయక్ వృద్ధురాలి పరిస్థితి చూసి చలించిపోయి అమెకు ఆశ్రయం కల్పించాలని నిర్ణయించుకున్నారు. యాదమ్మకు నీడ కల్పించాలన్న ఆలోచనతో తన స్నేహితుడైన బిల్డర్ జీఎం ఖాన్ కు విషయాన్ని వివరించి ఇంటి నిర్మాణ పనులు చేపట్టారు. తన సొంత నగదుతో ఇల్లు నిర్మాణంతో పాటు ఇంటికి మౌలిక వసతుల్ని కూడా కల్పించారు. అలాగే రెండు నెలలకు సరిపడ్డ నిత్యవసర వస్తువుల్ని కూడా అందించారు. ఐతే ఈ కార్యానికి తమ తోటివారి సహాయం కూడా ఎంతో ఉందని రాజు నాయక్ అంటారు.
ఇల్లు నిర్మించిన తర్వాత తిరిగి యాదమ్మను ఆశ్రమం నుంచి ఇంటికి తీసుకొచ్చారు. ఇల్లును చూసిన ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. కన్న కొడుకులాగా ఇల్లును నిర్మించాడని అవ్వ కళ్ళు ఆనంద బాష్పాలతో నిండి పోయాయి. పదిహేనేళ్ల క్రితం యాదమ్మ భర్త ఓ ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది యాదమ్మ. తుమ్మలబస్తీలోని బాల్కపూర్ నాలా వద్ద ఓ చిన్న రేకుల షెడ్డు వేసుకొని కాలం వెల్లదీస్తోంది. యాదమ్మ పరిస్థితి చూసి చలించిన స్థానిక మహిళలు ఆమెకు సపర్యాలు చేయడంతో పాటు కడుపు నింపుతున్నారు. యాదమ్మకు రాజు నాయక్ చేసిన సహయానికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
సైఫాబాద్ ఏసిపి వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటిలోకి యాదమ్మతో గృహప్రవేశం చేయించారు. యాదమ్మకు ఇక ఏ లోటూ రాకుండా అన్ని ఏర్పాట్లు కల్పించాలని నిర్ణయించారు. డీఐ రాజు నాయక్ ను ఆదర్శంగా తీసుకొని మనసున్న మారాజులు ఇలా అనాధలుగా ఉన్నవారిని అక్కున చేర్చుకోవాలని హెచ్ఎమ్ టీవీ కోరుకుంటోంది.