ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర కేసు.. పోలీసు విచారణలో కీలక అంశాలు
Jeevan Reddy: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర కేసులో పోలీసుల విచారణలో కీలక అంశాలు వెలుగు చూశాయి.
Jeevan Reddy: ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర కేసులో పోలీసుల విచారణలో కీలక అంశాలు వెలుగు చూశాయి. నాందేడ్‌లో 32 వేలకు ప్రసాద్‌గౌడ్ గన్ కొనుగోలు చేసినట్టు విచారణలో వెల్లడైంది. ప్రసాద్‌తో పాటు స్నేహితులు, డీలర్ సంతులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక బేగంబజార్‌లో బొమ్మ తుపాకీ కొనుగోలు చేసిన ప్రసాద్ ఊరిలో తనను ఒంటరిని చేసిన టీఆర్‌ఎస్ నాయకులను బెదిరించడం కోసమే గన్ కొనుగోలు చేసినట్టు పోలీసులకు తెలిపాడు. జీవన్‌రెడ్డి ఇంటికి తుపాకీతోనే వెళ్లిన ప్రసాద్ ఎమ్మెల్యేను కలవాలని చెప్పడంతో అక్కడున్న సెక్యూరిటీ లోపలికి అనుమతించారు.
జీవన్‌రెడ్డితో మాట్లాడేందుకు ప్రసాద్ ప్రయత్నించగా ఎందుకు వచ్చావంటూ ప్రసాద్‌ను జీవన్‌రెడ్డి బయటకు పంపారు. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డితో ప్రసాద్ వాగ్వాదానికి దిగడంతో జీవన్‌రెడ్డి అతడిపై చేయిచేసుకున్నారు. అక్కడున్న సెక్యూరిటీ అప్రమత్తమై ప్రసాద్‌గౌడ్‌ను బయటకు నెట్టేశారు. అదే సమయంలో ప్రసాద్ దగ్గర తుపాకీ ఉన్నట్టు గుర్తించారు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి. దీంతో తన సిబ్బందితో కలిసి ప్రసాద్‌ను ఆయన నిర్బంధించారు. గతంలో మావోయిస్టు సానుభూతిపరుడిగా ప్రసాద్ పనిచేసినట్టు పోలీసులు సమాచారం సేకరించారు.