Police Extortortion Intensifies in Adilabad: అక్రమార్కుల గుండెల్లో నిద్రపోవాల్సిన వాళ్లు అవినీతి సొమ్ము కోసం మాఫియాకు వంతపాడుతున్నారు. దోపిడీదార్లకు దడ పుట్టించాల్సిన పోలీసులు కాసుల కక్కుర్తితో అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రొబేషనరీ పిరియడ్ ముగియక ముందే మాఫియాతో చేతులు కలుపుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో స్మగ్లర్ల చేతిలో బందీలైనా పోలీసులపై ప్రత్యేక కథనం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్రమాలను అడ్డుకోవాల్సిన కొందరు పోలీసులు చేతులు ఎత్తేస్తున్నారు. స్మగ్లర్ల భరతం పట్టాల్సిన ఖాకీలు మాముళ్ల మత్తులో జోగుతున్నారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో అడ్డుఅదుపూ లేకుండా సాగుతున్న స్మగ్లింగ్‌ను అడ్డుకోవాల్సిన పోలీసులు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. పీడియస్ బియ్యం, నల్లబెల్లం దందా, అక్రమ కలప దందా చేసే కొందరు అవినీతిపరులతో పోలీసులు కుమ్మక్కయ్యారన్న ప్రచారం జోరుగా సాగుతోందిప్పుడు.
కుమ్రంబీమ్ జిల్లా మహారాష్ట్ర, చత్తీఘడ్ రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం. ఈ రాష్ట్రాలకు తెలంగాణ రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. అలాగే మహారాష్ట్ర నుంచి భారీగా నల్లబెల్లం కూడా అసిపాబాద్, సిర్పూర్-టి నియోజకవర్గాలకు చేరుతుంది. రేషన్ బియ్యం ప్రతినెల 15 కోట్ల విలువ గల రేషన్ బియ్యాన్ని అక్రమంగా మాఫియా తరలిస్తోంది. ప్రతినిత్యం వందల లారీలో బియ్యం అక్రమంగా రవాణ జరుగుతోంది. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడికి వెళ్తుంది అన్న విషయాలు పోలీసులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. దీంతో బియ్యం దందా యథేచ్చగా సాగుతోంది. అలాగే నల్లబెల్లం, స్పటిక ప్రతినిత్యం లారీలలో అక్రమంగా మహారాష్ట్ర నుంచి తెలంగాణకు రవాణ అవుతోంది. కానీ ఏ చెక్‌పోస్టులలో తనిఖీలు చేయరు పట్టుకోరు. దాంతో బెల్లం, స్పటిక నిషేధ లేదన్నట్లుగా జరుగుతుండటం విశేషం.
రేషన్ బియ్యం, బెల్లం దందా చేసే మాఫియాతో పోలీసులకు సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా ఉంది. అందుకే బియ్యంలారీల పట్టుబడుతున్నా కేసులు నమోదు చేయడం లేదని చెప్పుకుంటున్నారు. రేషన్‌బియ్యం దందా చేస్తే పీడీ కేసులు నమోదు చేస్తామన్న సర్కార్ హెచ్చరికలను ఎవరూ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాఫియాతో పోలీసులు చేతుల కలిపారని కొందరు ఉన్నాతాధికారులకు ఫిర్యాదులు కూడా చేశారని, విచారణలో దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయని జిల్లా ప్రజలు గుసగుసలాడుతున్నారు.
లింగాపూర్ మండలంలో ఓ ఎస్సై అక్రమ సంపాదన కోసం కలప స్మగ్లర్లతో చేతులు కలిపి ఫర్నీచర్ దందా కూడా ప్రారంభించాడట. గత కొన్ని రోజులుగా స్మగ్లర్లతో చేతులు కలిపి దందా సాగిస్తున్నారని విచారణలో తేలిందట. ఆ సదరు ఎస్సైపై అటవీ అధికారులు కేసు నమోదు చేయడం విశేషం. ఇచ్చోడ నుంచి రోజూ ఇతర ప్రాంతాలకు కలప అక్రమ దందా సాగుతోంది. నెలకు కనీసం 15 కోట్ల కలపను ముల్తానీ మాఫియా ఇతర ప్రాంతాలకు తరలిస్తుందని చెప్పుకుంటున్నారు. కాసుల కక్కుర్తి కోసం కొందరు ప్రొబేషనరీ పిరియడ్‌లో దూకుడు ప్రదర్శిస్తున్నారట. కుమ్రంబీమ్ జిల్లాలో సస్పెండ్‌కు గురైన ముగ్గురు పోలీసులు ఇంకా ప్రొబేషనరీ పిరియడ్ కూడా పూర్తి కాలేదు. కానీ అక్రమ సంపాదన కోసం మాఫియాతో చేతులు కలిపారన్న ప్రచారం ఉంది. ఏమైనా అక్రమ దందాలకు చెక్ పెట్టాల్సిన పోలీసులు అక్రమార్కులతో చేతులు కలపడంపై తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి.