Phone Tapping Case: తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్
Phone Tapping Case: ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు?
Phone Tapping Case: ఉద్యోగులు బాస్ చెప్పిన పని పనిచేస్తుంటారు. ఇది ఎక్కడైనా కామనే. ఎవరిని ఏ హోదాలో ఉంచాలి... ఎవరికి ఏ పని అప్పగించాలి... అనేది బాస్ నిర్ణయం. ఏ వ్యవస్థలో అయినా నిర్ణయాలు ఈ తరహాలోనే జరుగుతుంటాయి. కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం అలా జరగలేదన్న సందేహాలు ఏర్పడుతున్నాయి. మరి వీళ్లు ఎవరి ఆదేశాల మేరకు పనిచేశారు...? వీళ్లు చేసిన పని బాస్‌కి తెలిసే జరిగిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలోని స్పెషల్ ఆపరేషన్ టీం కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. ఎస్ఐబీకి ఓఎస్డీ హోదాలో ప్రభాకర్ రావు ఉన్నా... ఈ విభాగం సైతం ప్రధాన ఇంటెలిజెన్స్‌లో అంతర్భాగమే. దీనికి అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారులు బాస్‌లుగా ఉంటారు. విదేశాల నుంచి ఎలాంటి నిఘా వస్తువులు కొనుగోలు చేయాలన్నా కచ్చితంగా నిఘా విభాగాధిపతితో పాటు డీజీపీ అనుమతి తప్పనిసరి. కానీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
కొందరు పోలీస్ ఉన్నతాధికారుల భవిత ఈ కేసులో నిందితులుగా ఉన్న పోలీసుల చేతిలో ఉండటం ఆసక్తి కలిగిస్తోంది. వీళ్లు చెప్పే అంశాలపై డీజీపీ, అదనపు డీజీ స్థాయి అధికారులకు నోటీసులు ఇవ్వాలా... వద్దా.... అనేది ఆధారపడి ఉందని అంటున్నారు. ఇలావుండగా ట్యాపింగ్ కేసులో అరెస్టు అయిన హైదరాబాద్ టాస్‌కఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావును ఈ నెల 10 వరకు పోలీసు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పోలీసు కస్టడీ పూర్తయి, జ్యుడీషియల్ రిమాండ్‌కు వెళ్లిన అదనపు ఎస్పీ భుజంగరావును అదనపు కస్టడీకి కోరుతూ పంజాగుట్ట పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అంశాలు, నిందితులుగా ఉన్న పోలీసు అధికారుల వాంగ్మూలాలను బట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు నేతృత్వంలో సాగింది. దర్యాప్తు అధికారులు సైతం ప్రస్తుతానికి ఇంతవరకే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అరెస్టు అయిన పోలీసులతో పాటు అరెస్టు కాబోయే వారు.... విదేశాల్లో ఉన్న ప్రభాకర్‌రావు పట్టుబడిన తర్వాత.. ఉన్నతాధికారులకు తెలిసే ఈ వ్యవహారం జరిగిందని వారు చెబితే వారికీ నోటీసులు ఇవ్వక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పోలీసులు ఇచ్చిన నోటీసుల ఆధారంగా బంజారాహిల్స్ ఠాణాకు బుధవారం వచ్చిన ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ వేణుగోపాల్‌రావును సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఎస్‌ఐబీలోని ఎస్‌ఓటీలో కీలకంగా వ్యవహరించిన నలుగురు అధికారుల్లో ఓఎస్డీ హోదాలో పని చేసిన ఈయన కూడా ఒకరు. అదనపు ఎస్పీగా పదవీ విరమణ చేసిన అనంతరం ప్రభాకర్‌రావు సూచనల మేరకు ఓఎస్డీగా పని చేశారు. ఈ వ్యవహారానికి ముగింపు రావాలంటే... విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావును అరెస్టు చేసి విచారిస్తే కానీ ఈ కేసులోని నిందితులు ఎవరనేది కొలిక్కి రానుంది.