తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో నయా ట్రెండ్.. తక్కువ ధరకే పెట్రోల్ లభించడంతో జనం పరుగులు..

Telangana Karnataka Border: తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో నయా ట్రెండ్ నడుస్తోంది.

Update: 2022-05-20 09:50 GMT

తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో నయా ట్రెండ్.. తక్కువ ధరకే పెట్రోల్ లభించడంతో జనం పరుగులు..

Telangana Karnataka Border: తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో నయా ట్రెండ్ నడుస్తోంది. రాష్ట్ర సరిహద్దు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు పక్క రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. అంతలా వీళ్ళను అక్కడ వారిని ఏం ఆకర్షిస్తోంది? ఎందుకు తెలంగాణ ప్రాంతం నుంచి ప్రజలు పక్క రాష్ట్రం వైపు చూస్తున్నారు...? ఇక్కడ లేనిదేమిటి? అక్కడ ఉన్నదేంటి?

తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల ప్రజలు పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని ప్రజలు వాహనాలతో కర్ణాటకకు క్యూ కడుతున్నారు. అక్కడ ఉన్న పెట్రోల్ బంక్‌ల నుంచే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. తెలంగాణలోని వారి సొంత ఊళ్లోనే పెట్రోల్ బంకులున్నా కాదు కాదంటూ పొరుగు రాష్ట్రానికి వెళ్లి తెచ్చుకుంటున్నారు. అందుకు కారణం తెలంగాణ కంటే కర్ణాటకలో పెట్రోల్,డీజిల్ ధరలు తక్కువగా ఉండడమే.

సరిహద్దు ప్రాంతాల ప్రజలు పెట్రోల్, డీజిల్ కోసం కర్ణాటక తరలి వెళ్తుండటంతో తెలంగాణ సరిహద్దులో ఉన్న పెట్రోల్ బంక్‌లు వెలవెలబోతున్నాయి. తక్కువ ధరకు లభించడంతో ప్రజలు అటువైపు వెళ్తున్నారని తమ వ్యాపారాలు సాగడం లేదని స్థానిక పెట్రోల్ బంక్ యజమానులు బోరుమంటున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కంటే కర్ణాటక రాష్ట్రంలో పెట్రోల్,డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయి. పెట్రోల్,డీజిల్‌పై 10 రూపాయల వ్యత్యాసం ఉంది. తెలంగాణలో లీటర్ పెట్రోల్ రూ. 120.85 పైసలు ఉంటే, కర్ణాటకలో 110.85 పైసలుగా ఉంటే డీజిల్ విషయానికి వస్తే తెలంగాణలో లీటర్ డీజిల్ 106.76 పెసలు ఉంటే కర్ణాటకలో 95.78 పైసలు ఉంది. ఇలా రెండింటిపైనా ఒక్క లీటర్‌కు 10 రూపాయల తక్కువకు లభించడంతో ఎక్కువ మంది స్థానికులు కర్నాటక వైపు మొగ్గుచూపుతున్నారు. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న పెట్రోల్ బంక్‌లో ఎక్కువగా తెలంగాణ ప్రాంత ప్రజల వాహనాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

దీనితో పెట్రోల్,డీజిల్‎ను ఎక్కువగా వినియోగించే వారు కర్ణాటక రాష్ట్రానికే ఎక్కువగా వచ్చి ఒకేసారి బల్క్‎లో పెద్ద ఎత్తున్న తీసుకు వెళ్తున్నారు. రైతులు కూడా వారి అవసరాల కోసం ఒక్కోసారి 20 నుంచి 30 వేల రూపాయల డీజిల్‌ను కొనుగోలు చేస్తున్నారు. దీంతో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ బంక్‎లు వాహనాలతో నిండిపోయి ఉంటే తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉన్న పెట్రోల్ బంక్‎లు మాత్రము బోసిపోయి కన్పిస్తున్నాయి. గతంలో ఇక్కడ ప్రతి రోజు నాలుగు నుండి ఐదు వేల లీటర్ల పెట్రోల్, డీజిల్ అమ్మేవారమని ఇప్పుడు 2000 లీటర్లు కూడా అమ్ముడుపోవడం లేదంటున్నారు. జహీరాబాద్, నారాయణ ఖేడ్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ సమస్య ఉంది. ఈ కారణంగా కర్ణాటక సరిహద్దుకు అతి దగ్గరగా తెలంగాణలో ఉన్న పెట్రోల్ బంక్ ల పై ఈ ప్రభావం ఎక్కువగా కనబడుతోంది. ఇప్పటికే కొన్ని బంకులు మూతపడ్డాయ్ కూడా. తెలంగాణలో రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల తాము పెద్ద ఎత్తున నష్టపోతున్నామని ఇలా పక్క రాష్ట్రాల నుండి డీజిల్ తెచ్చుకునేవారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక డీలర్లు కోరుతున్నారు.

ప్రైవేటు వాహనాల వారే కాదు ప్రభుత్వ వాహనాల కోసం కూడా పక్క రాష్ట్రం నుండే డీజిల్ ను తెప్పిస్తున్నారు అధికారులు. మొన్నటికి మొన్న నారాయణఖేడ్ ఆర్టీసీ డిపోలోకి కూడా కర్ణాటక నుండే డీజిల్ తెప్పించుకున్నారు. వాహనాన్ని పోలీసులు పట్టుకొగా అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పడంతో వదిలేసారు పోలీసులు. అయితే తెలంగాణలో ఉన్న పెట్రోల్ బంక్ ల యజమానులు మాత్రం అలా పక్క రాష్ట్రాల నుండి పెట్రోల్, డీజిల్ తీసుకొని రావడానికి అనుమతి లేదని అంటున్నారు. ఇదే సమయంలో కొందరు ఆటోల్లో పెద్ద క్యాన్లలో వేల లీటర్ల డీజిల్, పెట్రోల్ తీసుకొని వెళ్తున్నారని ఏదైనా ప్రమాదం జరిగితే పెను పెద్ద ప్రమాదం తప్పదంటున్నారు ఎక్స్‌పర్ట్స్. 

Tags:    

Similar News