TS RTC: ఆర్టీసీ రిటైర్డ్‌ కార్మికులకు పెన్షన్ కష్టాలు

రెండు నెలలుగా పెన్షన్‌ ఇవ్వని యాజమాన్యం రూ.420 కోట్లు బకాయిపడ్డ ఆర్టీసీ

Update: 2021-06-26 01:55 GMT

ఆర్టీసీ ఉదోగులు (ఫైల్ ఇమేజ్)

TS RTC: తెలంగాణ ఆర్టీసి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఓ వైపు ఉన్న ఉద్యోగులు జీతాలు రాక ఇబ్బందులు పడుతుంటే.. రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఏళ్ల పాటు సంస్థ కోసం పనిచేసిన ఉద్యోగులు.. ఇప్పుడు బస్‌ భవన్‌ చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పరిస్థితులు నెలకొన్నాయి.

సుదీర్ఘ కాలం ఆర్టీసీలో సేవలందించిన రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. 2 నెలలుగా పెన్షన్ రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెన్షన్‌తో పాటు మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు ఇచ్చే డెత్‌ ఎక్స్‌గ్రేషియా కూడా సెటిల్‌ చేయడం లేదు. నెలకు 2 వేల 500 నుంచి 3 వేల చొప్పున పెన్షన్‌‌ అందాల్సి ఉండగా.. ఎక్స్‌గ్రేషియా సెటిల్‌మెంట్లతో కలిపి సంస్థ 420 కోట్ల రూపాయలు బకాయి పడింది.

స్టాఫ్‌ రిటైర్‌మెంట్‌ బెనిఫిట్‌స్కీమ్‌ కింద సర్వీసులో ఉన్న ప్రతి ఉద్యోగి వేతనం నుంచి నెలకు 250 రూపాయల చొప్పున యాజమాన్యం కట్‌ చేస్తుంది. ఇలా ప్రతి నెలా సగటున 4 కోట్లు ఎస్‌ఆర్‌బీఎస్‌ అకౌంట్‌లో జమ అవుతాయి. ఈ సొమ్ముతో ఉద్యోగుల సర్వీసును బట్టి పెన్షన్‌ చెల్లిస్తారు. ఇదే తరహాలో స్టాఫ్‌ బెనివొలెంట్‌ థ్రిఫ్ట్ స్కీమ్‌ కింద మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు లక్షా 50 వేల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తుంటారు. ఇందుకోసం ఒక్కో ఉద్యోగి వేతనం నుంచి రూ.100 మినహాయించుకుంటారు. ఈ మొత్తాన్ని ఎస్‌బీటీ అకౌంట్‌లో జమ చేయాల్సి ఉన్నా ఇప్పటివరకు యాజమాన్యం స్పందించడం లేదు.

రిటైర్మెంట్‌ తర్వాత పెన్షన్ డబ్బులతోనే గడుపుతోన్న ఉద్యోగులు.. ఇప్పుడు ఆ డబ్బులు రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరికి రిటైర్డ్ అయి సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు పెన్షన్ అమలు కాలేదు. దాంతో వారంతా బస్ భవన్ చుట్టూ తిరుగుతున్నారు. తమక డబ్బులు జమ చేయాలంటూ మొరపెట్టుకుంటున్నారు. అయితే ఆర్టీసీ నష్టాల పేరు చెబుతూ ఉద్యోగులను ఇబ్బందులు పెడుతోందని.. ఈ పరిస్థితికి యాజమాన్యం, ప్రభుత్వం వైఫల్యమే కారణమంటున్నారు రిటైర్డ్ ఉద్యోగులు.

ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన పెన్షన్ వెంటనే విడుదల చేయాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కరోనాతో కష్టాలు పడుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు.. పెన్షన్లు ఇవ్వకపోవడం బాధాకరమని.. యాజమాన్యం ఉద్యోగులను ఇబ్బందులు పెట్టే పద్ధతి మానుకోవాలన్నారు.

ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న క్రెడిట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీకి సంబంధించిన డబ్బును కూడా రెండేళ్లుగా యాజమాన్యం బదిలీ చేయడం లేదు. ఆ బకాయిలు వడ్డీతో కలిపి వెయ్యి 80 కోట్లకు చేరాయి. సొమ్మును బదిలీ చేయాలంటూ సీసీఎస్‌ కమిటీతో పాటు సీఎం, మంత్రులకు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సీసీఎస్‌ సభ్యత్వాన్ని రద్దు చేసుకోవడానికి 12 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరి సెటిల్‌మెంట్లకు సంబంధించి రూ.170కోట్లు అవసరమవుతాయి. ఈ కొద్ది సొమ్మును కూడా యాజమాన్యం సర్దలేకపోతోంది.

Full View


Tags:    

Similar News