Patnam Narender Reddy: కొడంగల్ కొట్లాటలో వెలుగుచూస్తోన్న కొత్త కోణాలు.. పట్నం వెర్షన్ ఏంటి? వీడియో
Patnam Narender Reddy rubbishes statement against KTR: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ప్రభుత్వ అధికారులపై దాడి ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన ఈ వివాదం కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, స్థానిక బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుతో మరింత సీరియస్‌గా మారింది. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ఉండడంతో వివాదం మరో స్థాయికి చేరింది. నరేందర్ రెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరు ప్రస్తావనకు తెచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో ఏముంది?
తమ నాయకుడు కేటీఆర్ ప్రోద్బలంతోనే లగచర్లలో గ్రామస్తులు అధికారులపై దాడి చేసేందుకు కుట్ర పన్నినట్లుగా పట్నం నరేందర్ రెడ్డి అంగీకరించారని రిమాండ్ రిపోర్టు చెబుతోంది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచి, రాజకీయంగా మైలేజ్ సంపాదించుకోవడమే లక్ష్యంగా ఈ దాడికి వ్యూహరచన చేశామంటూ పట్నం తన నేరాన్ని అంగీకరించారన్నది ఈ వార్తల సారాంశం. అయితే, పట్నం మాత్రం తాను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని గురువారం ప్రకటించారు.
నేను పోలీసులకు ఏం చెప్పలేదు – పట్నం
పోలీసులకు తానే ఏమీ చెప్పలేదని పట్నం నరేందర్ రెడ్డి ప్రకటించడంతో ఈ వివాదంలో కొత్త సందేహాలు రాజుకున్నాయి. తాజాగా నరేందర్ రెడ్డి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులకు ఏమీ చెప్పకపోయినా వాంగ్మూలం ఇచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తన పిటిషన్లో ఆరోపించారు. అంతేకాకుండా, పోలీసులు కొన్ని పేపర్లపై తనతో సంతకాలు చేయించుకున్నారని అన్నారు. ఇదిలా ఉంటే, నరేందర్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా వికారాబాద్ పోలీసులు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.
పోలీసులు లేకుండా రా.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
ఈ పరిణామాలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే కొడంగల్‌లో ఏం జరిగిందో అందరూ తెలుసుకునేలా మీడియాను కెమెరాలతో సహా ఫ్యాక్ట్ ఫైండింగ్‌కు పంపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు లేకుండా నువ్వు రా.. ఇద్దరం ఇద్దర కొడంగల్ పోదాం అని ఛాలెంజ్ చేశారు. మీడియా కెమెరాల ముందే ప్రజలు ఏం చెబుతారో తెలుసుకుందాం అన్నారు. అక్కడ గిరిజనుల భూములు లాక్కున్నారా లేదా? మీ సోదరుడు అనుముల తిరుపతి రెడ్డి ఎస్సీఎస్టీ రైతులను తిట్టాడా లేదా? తన్ని భూములు తీసుకుంటాం అని బెదిరించాడా లేదా అని ప్రశ్నించారు. మీ చేతకాని తనానికి ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపైనే కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాం అంటే భయపడే వాళ్లు ఎవరూ లేరన్నారు.
కేటీఆర్ ఎక్స్‌లో కూడా ఘాటుగా స్పందించారు. ఎవనిది కుట్ర? ఏంది ఆ కుట్ర అని నిలదీశారు. నీకు ఓటేసిన పాపానికి వారి భూములను కాజేయాలనుకోవడం కుట్ర కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. నీ అల్లుని కోసమో, అన్న కోసమో… రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? గత తొమ్మిది నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకు ఈడ్వడం కుట్ర కాదా అని ప్రశ్నించారు.
50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలకు, రైతు కష్టం కుట్రగా కాక ఎలా కనిపిస్తుందని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తనను ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తారని ఎప్పుడో తెలుసని అన్నారు. నీ కుట్రలకు భయపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. అరెస్ట్ చేస్తే చేసుకో రేవంత్ రెడ్డి.. చూద్దువుగాని నిజానికి ఉన్న దమ్మేంటో అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
కేటీఆర్‌కు అండగా బీఆర్ఎస్
బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు కాంగ్రెస్‌పై మాటల దాడిలో కేటీఆర్ కు అండగా నిలిచారు. హరీష్ రావు చర్లపల్లి జైలుకు వెళ్లి పట్నం నరేందర్ రెడ్డిని కలిశారు. ఆయనకు పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన జైలు బయట మీడియాతో మాట్లాడారు. లగచర్ల గ్రామంలో ప్రభుత్వ అధికారులపై దాడికి పాల్పడినట్లుగా చెబుతూ గ్రామస్తులను అరెస్ట్ చేయడాన్ని మంత్రి హరీష్ రావు ఖండించారు.
లగచర్ల సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం పరిధిలోకి వస్తుండటంతో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మీకు ఓటేసిన పాపానికి మీరు ఆ లగచర్ల గ్రామస్తులపై కర్కశంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన స్థానిక నేతగా పట్నం నరేందర్ రెడ్డి ప్రజలతో టచ్ లో ఉన్నంత మాత్రాన్నే కేసులు పెడతారా అని ప్రశ్నించారు.
అయితే, పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ ప్రస్తావన ఎంత వేడి రాజేసిందో బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్న తీరే చెబుతోందని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
వికారాబాద్ కలెక్టర్ హత్యకు కుట్ర – జగ్గారెడ్డి
బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలను కాంగ్రెస్ కూడా అంతే తీవ్రంగా తిప్పికొడుతోంది. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను చంపాలని బీఆర్ఎస్ నేతలు కుట్ర పన్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. కలెక్టర్ పై దాడి పథకం ప్రకారమే జరిగిందని అన్నారు.
కేటీఆర్‌కు జైలు భయం పట్టుకుంది: మంత్రి కోమటిరెడ్డి
బుధవారం నల్గొండలో ఈ విషయమై మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేటీఆర్‌కు జైలు భయం పట్టుకుందని అన్నారు. వికారాబాద్ దాడి వెనుక కేటీఆర్, పట్నం నరేందర్ రెడ్డి ఉన్నారనడానికి పోలీసుల దగ్గర ఆధారాలున్నాయని ఆరోపించారు. ఏమైనా, సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం పరిధిలో జరిగిన ఈ ఘటన సీరియస్ మలుపు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.