నిత్యం శ్రీశైలం వస్తూ పోతుండే వాహనాలతో రద్దీగా ఉండే శ్రీశైలం ఘాట్‌రోడ్డులో అనుకోని రీతిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట మూల మలుపు వద్ద రోడ్డు పక్కన ఉన్న సేఫ్టీ వాల్‌ను వ్యాను ఢీకొని సుమారు 20 అడుగులు లోతున్న లోయలోకి పడిపోయింది.
హైదరాబాద్ దూల్‌పేటకు చెందిన కొంతమంది భక్తులు శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో అందులో వున్న ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదాన్ని గమనించిన వాహనదారులు, స్థానికులు వెంటనే స్పందించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అనంతరం లోయలో పడిన వారిని బయటికి తీశారు. ప్రమాదం సంభవించిన సమయంలో వ్యానులో సుమారుగా 10 మంది ప్రయాణికులు వున్నారని సమాచారం. కాగా వీరిలో ఇద్దరికి స్వల్ప గాయాలతో బయట పడగా మరో ఏడుగురు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి.
అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. గాయపడిన వారిలో ఏడుగురుపెద్దలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గాయపడిన వారిలో నలుగురి తీవ్ర పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. క్షతగాత్రులను ఈగలపెంటలోని జెన్‌కో ఆస్పత్రికి తరలించారు.