అర్ధరాత్రి ఎంజీబీఎస్‌లో ప్రయాణికుల ఆందోళన

* సరైన సమయానికి రాని మియాపూర్‌-గుంటూరు టీఎస్‌ ఆర్టీసీ బస్సు * కాంటాక్ట్‌ నెంబర్‌ కూడా లేకపోవడంతో రోడ్డుపై పడిగాపులు

Update: 2021-02-16 03:02 GMT

Representational Image

అర్ధరాత్రి హైదరాబాద్‌ ఎంజీబీఎస్‌లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. తాము బుక్‌ చేసుకున్న మియాపూర్‌ టు గుంటూరు టీఎస్‌ ఆర్టీసీ బస్సు సరైన సమయానికి రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంటాక్ట్‌ నెంబర్‌ కూడా లేకపోవడంతో రోడ్డుపై పడిగాపులు కాసారు. అయితే ఎట్టకేలకు రెండు గంటలు ఆలస్యంగా ఎంజీబీఎస్‌కు ఆర్టీసీ బస్సు చేరుకొంది. హమ్మయ్య అని బస్సు ఎక్కి సీట్లలో కూర్చునే సమయానికి బస్సులో సాంకేతిక సమస్య తలెత్తింది. ఎంతసేపటికీ బస్సు స్టార్ట్ కాలేదు. దీంతో.. బస్సు ఎప్పుడు రెడీ అవుతుందా అని మరో రెండు గంటలు ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక ఈ విషయంపై ఎంజీబీఎస్‌ డిపో అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని ఆరోపించారు ప్రయాణికులు. ఇది తమ పరిధిలోకి రాదని, తాము ఏం చేయలేమని నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకోవాలని, లేదంటే ఉదయం వరకు ఉండి వేరే బస్సులో వెళ్లాలని సూచించారని ఆందోళనకారులు తెలిపారు.

బస్సులో చిన్నపిల్లలు, మహిళలు, తెల్లారితే పరీక్షలకు వెళ్లేవారున్నారంటూ ప్రయాణికులు డిపో అధికారులను చుట్టుముట్టారు. ప్రయాణికుల ఆందోళనతో తెల్లవారుజామున 3 గంటలకు మరో బస్సును ఏర్పాటు చేశారు అధికారులు. అయితే ఆ బస్సులో సీట్లు, విండోస్‌ సరిగాలేకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు తప్పని పరిస్థితుల్లో కండిషన్‌లో లేని బస్సులోనే గుంటూరుకు పయనమయ్యారు. 

Tags:    

Similar News