Telangana: వలస ఓటర్లపై పార్టీల దృష్టి
Telangana: వలస ఓటర్లతో అభ్యర్థుల ఆత్మీయ సమ్మేళనాలు
Telangana: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి సారించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి జీవనోపాధి కోసం ముంబై, పుణె, భివండికి, పిల్లల చదువులు, మెరుగైన జీవనానికి హైదరాబాద్ నగరానికి వెళ్లిన ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
గ్రామాల వారీగా ఓటర్ల జాబితాలు తీసుకుని.. ఆయా ఓటర్ల వివరాలు, చిరునామా తెలుసుకుంటున్నారు. వారికి ఫోన్లు చేసి ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. ఈ నెల 30న పోలింగ్ రోజు గ్రామానికి వచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని హామీలిస్తున్నారు. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన కొందరు అభ్యర్థులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి వలస ఓటర్లు అధికంగా ఉన్న ముంబయి, పుణెకు వెళ్లి అక్కడ సమావేశాలు నిర్వహించారు.
అభ్యర్థులు కొందరు హైదరాబాద్‌లో నివసిస్తున్న వలస ఓటర్లతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఓటుహక్కును గ్రామాల్లోనే వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ మరిన్ని సమావేశాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
నల్గొండ, మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పలు కుటుంబాలు హైదరాబాద్ చుట్టూ విస్తరించిన కాలనీల్లో నివసిస్తున్నాయి. నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన ప్రజలు ఎక్కువగా ఎల్బీనగర్,సాగర్‌రోడ్, బీఎన్‌రెడ్డి నగర్ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు వీరి ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీ అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు.