Oxygen: తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఆక్సిజన్ కొరత
Oxygen: ఆస్పత్రుల్లో పేషెంట్లకు దొరకని ఆక్సిజన్ * ప్రైవేట్‌లో భారీగా డబ్బు దోచేస్తున్న నిర్వాహకులు
Oxygen: ఆస్పత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోయాయి. ఎటు చూసినా హృదయం ద్రవించిపోయే దృశ్యాలే. వేల సంఖ్యలో వస్తున్న కరోనా బాధితులకు ఎలా చికిత్స అందించాలో అర్థంకాక.. కటిక నేలమీదే వైద్యం అందిస్తున్నారు. ఇటు బెడ్స్, అటు నేలమీద కూడా ఖాళీ లేక.. బాధితులు ఆస్పత్రి బయటే పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఖాళీ దొరుకుతుందా అని వెయిట్ చేస్తున్నారు. సరైన ట్రీట్‌మెంట్ అందక..బాధితులంతా నరకయాతన అనుభవిస్తున్నారు. అటు శ్మశాన వాటికల్లో కూడా గుండెలు చలించిపోయే దృశ్యాలు కన్పిస్తున్నాయి. చితి మంటలు ఆరడమే లేదు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా దహన సంస్కారాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయినా సరే కరోనా డెడ్ బాడీస్ కుప్పలు కుప్పలుగా వచ్చిపడుతున్నాయి. అంత్యక్రియలు నిర్వహించేందుకు కూడా ఖాళీ ఉండటం లేదు.
కరోనా కోరలు చాచింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. దాదాపు అన్నీ చోట్ల బెడ్లు నిండిపోయాయి. కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ కొరత కూడా అధికంగా ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూడా అంగీకరించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత వాస్తవమేనని ఈటల రాజేందర్ స్పష్టం. ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో.. పేషెంట్లకు ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. దీంతో కరోనా చికిత్స అందిస్తున్న ఆస్పత్రల్లో ఆక్సిజన్ నిల్వలు తగ్గిపోతున్నాయి. డిమాండ్‌కు తగ్గస్థాయిలో ఏజెన్సీలు ఆక్సిజన్‌ను సరఫరా చేయలేకపోతున్నాయి. 50 మందికి డిమాండ్ ఉంటే 20 మందికి మాత్రమే ఏజెన్సీలు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్నాయి. కరోనా, ఇతర వ్యాధులు, హోం ఐసొలేషన్ పేషెంట్ల నుంచి ఆక్సిజన్‌కు డిమాండ్ ఏర్పడింది. ఆక్సిజన్‌కు డిమాండ్ పెరగడంతో వాటి ధర కూడా భారీగా పెరిగింది. ఇక ఆక్సిజన్ సిలిండర్లు రీ-ఫిల్లింగ్‌కు ఏజెన్సీలు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నాయి. 5 లీటర్లకు రూ. 15 వేలు, పది లీటర్లకు 20 వేలు వరకు ఏజెన్సీలు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు కరోనా విపత్కర పరిస్థితుల్లో చాలా మందిలో శ్వాసకోశ సమస్యలు పెరిగాయి. ఈ తరుణంలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత వైద్యరంగానికి సవాల్‌గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అస్తమా, గుండెపోటు సమస్యలున్న వారికి తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. అటు కరోనా ఆస్పత్రుల్లో సమస్య తీవ్రంగా ఉంది. దీంతో ఆక్సిజన్ కొరత తలెత్తకుండా చూసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది.
ఈ మేరకు ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి ప్రస్తుతమున్న పరిస్థితి సహా కేసులు అధికంగా నమోదవుతున్న12 రాష్ట్రాలలో వచ్చే 15 రోజులకు అవసరమయ్యే ఆక్సిజన్‌పై సమీక్షలో చర్చించారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యంపైనా ప్రధాని చర్చించారు. ప్లాంట్ల సామర్థ్యం మేరకు ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని మోడీ సూచించారు. మెడికల్ ఆక్సిజన్‌ను సరఫరా చేసే ట్యాంకర్లు ఎలాంటి ఆటంకం లేకుండా 24 గంటలు ప్రయాణించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, రవాణా సంస్థలకు సూచించారు. ఆక్సిజన్ ఫిల్లింగ్ కేంద్రాలకు 24 గంటలు పనిచేసేందుకు అనుమతిస్తున్నట్లు మోడీ తెలిపారు. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ దిగుమతికి చేస్తున్న ప్రయత్నాలను అధికారులు ప్రధానికి వివరించారు.