Oxygen Shortage In Ruya: రుయా ఆసుపత్రిలో మరణమృదంగం

Oxygen Shortage In Ruya: తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక 11 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు.

Update: 2021-05-11 01:15 GMT
Oxygen Shortage at Ruia Hospital 11Dead

Oxygen Shortage In Ruya:(File Image) 

  • whatsapp icon

Oxygen Shortage In Ruya: దేశ వ్యాప్తంగా అనేక మంది కరోనా రోగులు సకాలంలో ఆక్సిజన్ కొరత కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడి 11 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్‌ వెల్లడించారు. చెన్నై నుంచి రావాల్సిన ట్యాంకర్‌ ఐదు నిమిషాలు ఆలస్యం కావడంతో ఈ ఘోరం జరిగినట్లు తెలిపారు.

వెంటిలేటర్‌పై ఉన్న బాధితులు మాత్రమే చనిపోయారని మిగతా వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని కలెక్టర్‌ తెలలిపారు. వారి పరిస్థితి డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆక్సిజన్ సరఫరా నిలిచిపోగానే ఆసుపత్రిలో తొలుత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అప్రమత్తమైన వైద్యులు సీపీఆర్‌ విధానంలో శ్వాస అందించారు. బాధితుల బంధువులు పక్కనే ఉండి అట్టముక్కలతో గాలిని విసిరారు. ఆక్సిజన్ ట్యాంకర్‌ రాగానే సాంకేతిక నిపుణులు వెంటనే స్పందించి సరఫరాను పునరుద్ధరించారు. అప్పటికే 11 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

రుయా ఆసుపత్రిలో సుమారు వెయ్యి మందికి చికిత్స పొందుతున్నారు. ఇందులో 135 మంది ఐసియూ వార్డులో వుండగా.. మరో 465 మంది ఆక్సిజన్ పడకలపై ఉన్నారు. ఇందులో మొత్తం 163 మంది వెంటెలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఘటన జరిగిన ఎంఎం వార్డు పక్కనే 10 కేఎల్ సామర్థ్యం వున్న ఆక్సిజన్ పాలంటు ఉంది. రాత్రి 8 గంటల సమయంలో ఒక్క సారిగా ట్యాంకు నిండుకోవడంతో ప్రాణవాయువు సరఫరా నిలిచిపోయింది. ఇదే సమయంలో ఆక్సిజన్ పడకలపై చికిత్స పొందుతున్న బాధితులకు సిలిండర్ల ద్వారా ప్రాణవాయువును అందించేందుకు ప్రయత్నించారు.

ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉండటంతో ఊపిరాడక బాధితులు ఒక్కసారిగా గిలగిలా కొట్టుకున్నారు. వార్డుల్లో పరుగులు తీశారు. ఏం జరిగిందోనని ఎవరికీ అంతుపట్టని పరిస్థితి నెలకొంది. సుమారు 30 నిమిషాల వరకు ఆక్సిజన్ సరఫరా నామమాత్రంగానే జరిగిందని బాధితులు వాపోతున్నారు. ఆ తర్వాత ఆక్సిజన్ సరఫరా అయినా అప్పటికే పలువురు మరణించినట్లు అక్కడి వారు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఆక్సిజన్ ట్యాంకర్ రావడంతో అధికారులు హుటాహుటిన ప్లాంటులో ప్రాణవాయువును నింపారు అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగింది.

మరోవైపు ఈ ఘటనపై హోంమంత్రి సుచరిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. విషయం తెలుసుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఆక్సిజన్‌ అందక 11 మంది చనిపోయిన ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు. అలాగే, తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News