Telangana: రేపట్నుంచి ఓయూ, జెఎన్టీయూ పరిధిలో ఆన్‌లైన్ క్లాసులు.. ఎప్పటివరకంటే..?
Online Classes: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. రోజులు గడుస్తున్నా కేసుల సంఖ్య తగ్గకపోగా మరింత పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
Online Classes: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. రోజులు గడుస్తున్నా కేసుల సంఖ్య తగ్గకపోగా మరింత పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రభావం విద్యాసంస్థలపై తీవ్రంగా పడుతోంది. జనవరి మొదటి వారంలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సంక్రాంతి సెలవులను మూడు రోజులు ముందుకు జరిపి ఈనెల 8వ తేదీ నుంచే ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 16 వరకు సెలవులు ఉండగా 17 నుంచి విద్యా సంస్థలు తెరవాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజులు సెలవులు పొడిగిస్తు ఉత్తర్వులు జారి చేసింది. ఈ నెల 30 వరకు సెలవుల్ని పొడిగించినట్లు తెలంగాణ చీఫ్‌సెక్రటరీ ఆదివారం ప్రకటించారు.
కాగా ప్రభుత్వం సెలవులను పొడగించిన నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ, జెఎన్‌టీయూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో రేపటినుంచి ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించాలని ఓయూ నిర్ణయించింది. ఈ నెల 30 వరకు ఓయూ పరిధిలోని అన్ని తరగతులు ఆన్‌లైన్‌లో కొనసాగుతాయని, డిగ్రీ, పీజీ విద్యార్థులు గమనించాలని పేర్కొంది. జేఎన్‌టీయూ హైదరాబాద్ పరిధిలోనూ రేపట్నుంచి ఈ నెల 22 వరకు ఆన్‌లైన్ తరగతులు ఉంటాయని జేఎన్‌టీయూహెచ్ అధికారులు తెలిపారు. బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మా కోర్సులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.