Online Classes for College Students in Telangana: కరోనా కారణంగా మధ్యంతరంగా ముగిసిన విద్యార్థుల చదువులు పునఃప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాలల్లోనూ సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. అలాగే పాఠశాల విద్యార్థులకు కూడా డిజిటల్ బోధన ఉంటుందని తెలిపారు.
అధ్యాపకులు ఈ నెల 27 నుంచే కళాశాలలకు వెళ్ళాలని ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 5న రాధాకృష్ణన్ జయంతి కార్యక్రమం, ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం కూడా ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ మేరకు విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా వుండగా వచ్చే నెల 1 నుంచి పాఠశాల విద్యార్థులకు కూడా ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు కేసు తేలిన తర్వాత డిగ్రీ, యూజీ పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. మరోవైపు కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే అన్ని ప్రవేశపరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.