Godavari: గోదావరికి కొనసాగుతున్న వరద ఉధృతి
Godavari: భద్రాచలం దగ్గర నిలకడగా గోదావరి నీటిమట్టం * భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
Godavari: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం నిలకడగా కొనసాగుతుంది. దాంతో నిన్న జారీ చేసిన రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. భద్రాచలం దగ్గర గోదావరి ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. భద్రాచలం దగ్గర 46.7 అడుగులకు తగ్గింది.
మరోవైపు.. ధవళేశ్వరం దగ్గర వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రస్తుతం 10.4 అడుగులకు చేరుకుంది. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరింది. బ్యారేజ్ నుంచి 8.20 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. పోలవరం కాఫర్ డ్యామ్ దగ్గర భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కాపర్ డ్యాం ఉండడంతో ధవళేశ్వరానికి నీరు ఆలస్యంగా వచ్చి చేరుతుంది. కాపర్ డ్యామ్ వద్ద 31.9 మీటర్ల నీటి మట్టం నమోదు కావడంతో ఏజెన్సీ గ్రామాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని గ్రామాలన్నీ ఇప్పటికే మునిగిపోయాయి. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఇటు కృష్ణానదిలోనూ ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. కర్ణాటకలో భారీ వర్షాలు కురువడంతో ఆల్మట్టి నుంచి 3.42 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. జూరాల జలాశయం పూర్తి నీటిమట్టం 1048 అడుగులకు గానూ ప్రస్తుతం 1039 అడుగులకు చేరింది. దాంతో శ్రీశైలంకు వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 856.70 అడుగులకు నీటి మట్టం చేరుకుంది.